నల్లగొండ జిల్లా:ఇతర పార్టీల నుండి నాయకులను కొనుగోలు చేయటంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు పోటీపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు.నాంపల్లి మండల టిడిపి నాయకులతో చిట్టెంపాడులో సమావేశమైన ఆయన మాట్లాడుతూ అవినీతితో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో మునుగోడు నియోజకవర్గంలో నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ తమతమ పార్టీల్లో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యం అపవాస్యం చేస్తున్నారని వాపోయారు.
ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రవర్తిస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు అంటేనే అసహించుకునే పరిస్థితి వస్తుందన్నారు.మునుగోడు నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా వాటి మీద దృష్టి పెట్టి,పరిష్కారం చేయకుండా నాయకులను కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే చర్లగూడెం కిష్టరాయన్ పళ్లి భూ నిర్వాసితులకు పరిహారం అందించడంలో,ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.నేడు స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని,ఆయా పార్టీల వైఖరిని నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు.
భూ నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను కనీసం మరమ్మత్తు చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవా అని ప్రశ్నించారు.
వాటికోసం ఏనాడైనా రోడ్ల మీద కూర్చొని పోరాటం చేశారా అని ప్రశ్నించారు.ప్రజలకు పనిచేసే విషయంలో సమస్యలు పరిష్కరించే అంశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పార్టీల నాయకులు పోటీ పడాలని హితువు పలికారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా రాజకీయ కోణంలోనే చూడాలని, బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగమే మునుగోడు ఉప ఎన్నికని అన్నారు.ప్రజా సమస్యల ఏజెండాగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని అందుకు అనుగుణంగా సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ నియోజకవర్గ సమస్యలపై ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
సమావేశంలో ఎస్సీ సెల్,టిఎన్ టియుసి,తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శిలు గోసుకొండ వెంకటేష్,కొలను వేణుగోపాల్ రెడ్డి, మొగుదాల పార్వతమ్మ,నాంపల్లి మండల నాయకులు వజ్జ వెంకట్ రెడ్డి,పోలేపల్లి ప్రకాష్,గజ్జల ధర్మారెడ్డి, నారపాక నరసింహ,మంగు మహేష్,కొండ్రపల్లి కృష్ణయ్య,ముత్తయ్య,బుష్పక నరసింహ,రాములు, వి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.