నల్లగొండ జిల్లా:పాలకుల దివాళకోరు విధానాల వలన దళిత,గిరిజనుల బ్రతుకులు అత్యంత ఘోరంగా శిథిలమై చితికిపోతున్నాయని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున విమర్శించారు.నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాలోని ఎంసీఎం డిగ్రీ కాలేజీలో ఆదివారం జరిగిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా 8వ, మహాసభలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షతన నిర్వహించిన “దళితుల సంక్షేమం- ప్రభుత్వాల పాత్ర” అనే సెమినార్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించడంలో తీవ్రమైన వివక్ష కొనసాగుతోందన్నారు.బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టిస్తూ ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రప్రభుత్వం ద్వారా దళిత,గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక కానీ, బడ్జెట్ కేటాయింపులు గానీ,సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి కానీ,లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పీఎంజీఎస్,ఎన్ఎస్ఎఫ్డీసీ నిధులు బ్యాంకుల నిర్లక్ష్యం మూలంగా ఖర్చు కావడం లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్ధిక విధానాల వలన దళితుల,గిరిజనుల బ్రతుకులు ఛిద్రమైపోతూ,దేశంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ ఏడేండ్ల పాలనలో సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని,దళితులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం చేశారని,గత నాలుగేళ్లుగా ఎస్సీ కార్పోరేషన్ నిధులు సబ్సీడీలు రావడం లేదని అన్నారు.
దళిత బంధు పథకం మచ్చుకు కొన్ని ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి వచ్చిందని,ప్రజలు తిరగబడనిదే ఏ పథకాలు ముందుకు సాగని పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు.అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరల ప్రకారం మెనూ పెంచి,బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.పెరుగుతున్న ధరలతో సామాన్యులు కొనలేని,తినలేని పరిస్థితి దాపురించిందని,ధరలను నియంత్రించడంలో పాలకులు విఫలం చెందారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడేళ్ల కాలంలో 80 కుల దురహంకార హత్యలు జరిగాయని,కుల దురహంకార హత్యలు నివారించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు.కులాంతర వివాహితులకు రక్షణ చట్టం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.
దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి పథకం కాస్తా ఉన్న భూమిని గుంజుకునే పథకంగా మారిందని,పేదలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు.ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరించాయని,ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు.
ఈ సెమినార్ లో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్,ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కారంపుాడి ధనలక్ష్మి,కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతాల నాగార్జున,మల్లన్న,ఎస్ఎఫ్ఐ డీవిజన్ కార్యదర్శి కోరే రమేష్,కుాలి సంఘం జల్లా నాయకులు జఠావత్ రవీనాయక్,పొదిల్ల వెంకన్న, రెడ్డా నాయక్,చుక్క రమేశ్ తదితరులు పాల్గొన్నారు.