నల్లగొండ జిల్లా:ప్రాణ భయంతో ప్రజలు ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్( Private Hospitals) ను ఆశ్రయిస్తారు.సర్కార్ దవాఖానాలో తమకు సరైన వైద్యం అందదనే అపోహ ఇంకా ప్రజలను వెంటాడడమే దీనికి కారణమని అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మరలుతున్నారు.ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి,అనేక మంది ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
ప్రాణం పోగానే బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం కొంతమంది మధ్యవర్తులు రంగంలోకి దిగడం సెటిల్మెంట్ చేయడం ప్రాణానికి ఖరీదు కట్టడం ఇద్దరికీ రాజీ పెట్టడం ఆనవాయితీగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇలాంటి ఘటననే నల్లగొండ జిల్లా చండూరు పట్టణంలో ఆదివారం జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం…చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన బొల్లం శ్రీను(52) నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చిందని చండూరులోని గగన్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు.అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి,తెల్ల రక్తకణాలు తగ్గాయని ఆస్పత్రిలో జాయిన్ చేసుకొని మూడు రోజులు చికిత్స అందించారు.
ఆదివారం తెల్లవారుజామన పరిస్థితి విషమించడంతో నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.గగన్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇక్కడ సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందాడని ఆరోపించారు.దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మొహరించి, విషయాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.రంగంలోకి దిగిన ఇరువర్గాల పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్లోనే మంతనాలు జరిపి,చివరికి కోల్పోయిన ప్రాణానికి రూ.3 లక్షలు ఖరీదు కట్టి,ఇరువర్గాల మధ్య రాజీ చేసినట్లు సమాచారం.ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ఇలాంటి డాక్టర్లు,ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ మీనమేషాలు లెక్కిస్తూ ఉండడమే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.