సూర్యాపేట జిల్లా:నల్లగొండ జిల్లా గణేష్ పహాడ్ శివారులోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ చీమనీస్ సూర్యాపేట జిల్లా ప్రజల పాలిట పెను ప్రమాదంగా మారింది.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే విషపూరితమైన పొగతో ఈ ప్రాంత ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారని బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు.
ఈ పరిశ్రమ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పరిధిలో ఉండడంతో డెవలప్మెంట్ నిధులు, సేవలు నల్గొండ జిల్లా కేటాయిస్తున్నారని,ఈ పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యం,దుమ్ము,ధూళి మాత్రం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్యపహాడ్, మహంకాళిగూడెం,రావిపాడు,జాన్ పహాడ్ దర్గా పరిసర ప్రాంత ప్రజలకు శాపంలా మారిందని వాపోతున్నారు.పరిశ్రమ నుండి వచ్చే కాలుష్యంతో పాటు భారీ వాహనాలతో సిమెంటు దుమ్ముతో ప్రజలు,పంట పొలాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెన్నా సిమెంట్ ఇండస్ట్రియల్ నల్గొండ జిల్లా కింద ఉందని పక్కనే ఉన్న సూర్యపేట జిల్లా కింద ఉన్న గ్రామాలకు మాత్రం పెన్నా సిమెంట్ పరిశ్రమ గ్రామాల డెవలప్మెంట్ నిధులు కేటాయించకపోవడంతో ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం దుమ్ము ధూళితో తమ ప్రాంతాలు నష్టపోతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు గత కొంతకాలంగా చీమనీస్ నుండి వెలువడే పొగతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.
తాజాగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ ని ఆదాని గ్రూప్ అనుబంధ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని,ఇప్పటికైనా పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పరిసర గ్రామాలైన సూర్యాపేట జిల్లా గ్రామాలకు విలేజ్ డెవలప్మెంట్ నిధులు కేటాయించి పరిశ్రమల ద్వారా సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు.గత కొంతకాలంగా వెలువడే పొగపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.