నల్లగొండ జిల్లా:జిల్లాల్లో మండల కేంద్రమైన మర్రిగూడ మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలో గాడి తప్పింది.గ్రామ పంచాయితీలో నిధులు, సిబ్బంది ఉన్నా పారిశుద్ధ్య పనులు పడకేశాయి.
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా డెంగ్యూ కేసులో టాప్ ప్లేస్ లో ఉందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లాలో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చూడాలని,ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని చేసిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ గ్రామ పాలనా యంత్రాంగం పని చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామంలో ప్రధాన కూడలి శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద,కొండూరు రోడ్డు పక్కన,బస్టాండ్,చౌరస్తా రోడ్డు,ఎస్సీ కాలనీ రోడ్డు, బస్టాండ్ నుండి పాత బస్టాండ్ కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీకి స్లాబ్ లేకుండా ఉండడం,చెత్త,చెదారం మురికి కాలువలు నిండి ఉండడంతో దోమలు,ఈగలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇంట్లో వాడిన మురికి నీరు డ్రైనేజీలో నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుందని, వీటిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోతే సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోమలు వ్యాప్తి చెందకుండా క్లోరినేషన్ ఫాగింగ్ చేయాలని,నివాసాల మధ్యన పిచ్చి చెట్లు మొలసి అడవిని తలపిస్తున్నాయని,ఖాళీ ప్లాట్లలో చెట్లను వెంటనే తొలగించేలా యజమానులకు నోటీసులు అందించి శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.అదేవిధంగా పారిశుద్ద్య సిబ్బంది వివిధ ప్రాంతాలలో పూడిక తీసిన వ్యర్ధాలను అక్కడే వదిలేయడంతో వర్షాకాలంలో ఇబ్బందిగా మారిందని, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఇవేమీ పట్టకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి,పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేసి సంపద సృష్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని,కానీ,ఇక్కడ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు చెత్తను బస్తాలల్లో,కవర్లలో తెచ్చి ఊరి చివరలో రోడ్డుకు ఇరువైపులా వేస్తున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మర్రిగూడ ప్రజలను కాపాడాలని కోరుతున్నారు
.