నల్లగొండ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అనేక గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామంలో నిర్మించిన క్రీడా ప్రాంగణం కూడా క్రీడలకు పనికిరాకుండా పోయిందని స్థానిక యువత వాపోతున్నారు.
ఇందులో కొన్ని నెలలుగా కంకర డంపు చేసి డంపింగ్ యార్డ్ గా మార్చారని ఆరోపిస్తున్నారు.
అసలే క్రీడా ప్రాంగణంలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కంకర పోసి డంపింగ్ యార్డ్ గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కాలంలో ఉదయం,సాయంత్రం యువకులు క్రీడాప్రాంగణంలో ఆటలు ఆడుకునే అవకాశం లేకుండా చేశారని,ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి కంకర తొలగించి క్రీడా ప్రాంగణాన్ని క్రీడలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.







