నల్లగొండ జిల్లా:ప్రజావాణి,ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని,దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం కాకుండా పరిష్కరం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా చందంపేట తహశీల్దార్,ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారని అడగగా 266 ఫిర్యాదులు స్వీకరించామని తహశీల్దార్ శ్రీనివాస్ కలెక్టర్ కు వివరించారు.
ముఖ్యంగా తహశీల్దార్ స్థాయిలో ఉండే ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని,ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేవి ఆర్డీవో పరిష్కరించాలని, ఒకవేళ జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటే జాప్యం లేకుండా పంపించాల్సిందిగా ఆదేశించారు.మనసు పెట్టి పని చేస్తే నిజమైన ఫిర్యాదుదారులకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని, అందరూ బాగా పనిచేయాలన్నారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి పిటిషన్లు,ఆయా కేటగిరి వారిగా వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.పరిష్కారం చేయగలిగినవి తక్షణమే చేయాలని,పెండింగ్లో లేకుండా చూడాలని,ఒకవేళ పరిష్కారం కానీ ఫిర్యాదులను ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఎంపీడీవో లక్ష్మీని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, తహశీల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో లక్ష్మి,ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.