యాదాద్రి జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల ఆ పథకాలు టిఆర్ఎస్ కార్యకర్తల కోసమే తెచ్చినట్టుగా ఉన్నాయని ఆలేరు కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఇళ్లను కేటాయించిందన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో 17700 కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు ప్రకటించిందని పేర్కొన్నారు.ప్రజల డబ్బును ఈ పథకాలకు వెచ్చించిన సర్కారు, పెత్తనం మాత్రం ఎమ్మెల్యేలకు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలకు ఇవ్వడంవల్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు.అర్హులైన లబ్ధిదారులకు కాకుండా టిఆర్ఎస్ కార్యకర్తలకు ఈ పథకాలను పంపిణీ చేస్తారని ఆరోపించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్యేలు దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.దలితబంధు పథకం పూర్తిగా అమలు కాక ముందే రాష్ట్రంలో వసూళ్ల దందా నడుస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత ఇస్తే నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు అందుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల కాకుండా జిల్లా కలెక్టర్ ల పర్యవేక్షణలో గ్రామ సభల్లో ఎంపిక చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.