నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వ హాయంలో చేపల విక్రయాలకు కోసమని ఆధునిక హంగులతో రూ.లక్షల ప్రజా ధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన చేపల మార్కెట్ ను అట్టహాసంగా ప్రారంభించి,వ్యాపారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసి,నిరుపయోగంగా మార్చిన వైనాన్ని చూస్తే రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెతకు కాలం చెల్లిందని,ఇప్పుడు సర్కార్ సొమ్ము రాజకీయ కాంట్రాక్టర్ల పాలు అనాలని స్థానికులు పాలకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో సంత సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ప్రజల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) మత్స్య అభివృద్ది సంస్థకు చెందిన రూ.లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్ భవనాలు ఆర్భాటంగా నిర్మించగా, అప్పటి ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్( Ravindra Kumar Ramavath ) అట్టహాసంగా ప్రారంభించారు.కానీ, చేపల వ్యాపారులకు దుకాణాలు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతో గత ప్రభుత్వ హాయంలో రెండేళ్లు, ప్రస్తుత ప్రభుత్వంలో 8 నెలలు వృథాగా పడి ఉండడం గమనార్హం.
అయితే అప్పుడే అధికారులు నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు టెండర్లు పిలిపించి, ప్రభుత్వం మారడంతో పట్టించుకోలేదని తెలుస్తోంది.
దీనితో జాతీయ రహదారి,లోకల్ రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ రహదారులపై చేపల దుకాణాలు విచ్చలవిడిగా వెలిసి,చేపల వ్యర్థాలతో కంపు కొడుతున్నాయి.ఆ వ్యర్థాల కోసం కుక్కలు విపరీతంగా రోడ్లపైకి వచ్చి పాదచారులను, వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అధునాతన మార్కెట్ ఉన్నా రోడ్లపై వ్యాపారం తప్పడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త మార్కెట్ భవనాలు ఉపయోగంలో లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని,పిచ్చి మొక్కలు మొలిచి అస్తవ్యస్తంగా తయారైందని,ఇప్పటికన్నా పాలకులు స్పందించి గత రెండున్నర ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన చేపల మార్కెట్ ను తక్షణమే వ్యాపారులకు దుకాణాలు కేటాయించి వినియోగంలో తేవాలని,రోడ్లపై అక్రమంగా వెలిసిన దుకాణాలను తొలగించాలని కోరుతున్నారు.