నల్లగొండ జిల్లా: నాంపల్లి మండల కేంద్రంలో జరిగే అంగడి బజార్లో తై బజార్ పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లతో గత 15 నెలలుగా వ్యాపారస్తులు బెజారెత్తిపోతున్నారు.అనుమతులు లేకుండా తై బజార్ పేరుతో యధేచ్చగా దోపిడీ చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉండడం గమనార్హం.
అయితే ఈ వసూళ్ల పర్వం మొత్తం గ్రామ కార్యదర్శి కనుసన్నల్లోనే జరుగుతుందని, దీని వెనుక ఇంకా కొందరి పెద్దల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నాంపల్లి అంగడికి ఉన్న తై బజార్ గడువు కూడా 2023 మార్చిలోనే తీరిందని,
అయినా అప్పటి నుండి నేటి వరకు 15 నెలలుగా తై బజార్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని,ఇదెంటని ప్రశ్నిస్తే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని,మా వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.
నాంపల్లి మండలంలో ఇలాంటి అరాచకాలు చాలా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దోచుకున్న దాంట్లో నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగడిలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.