సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.వాళ్లలో మన తెలుగమ్మాయిలు కూడా ఉంటారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కారణంగా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళని సినిమాల్లో నటించడానికి పంపించరు.అవకాశాలు వచ్చినా గాని సినిమాల్లో నటించడానికి భయపడతారు.
కానీ నటి అవ్వాలన్న బలమైన కోరికను నెరవేర్చుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్ళకి యూట్యూబే సరైన ప్లాట్ ఫార్మ్.ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా చాలా మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు మనకి పరిచయం అయ్యారు.
ఛాయ్ బిస్కెట్, పక్కింటి కుర్రాడు, వైవా హర్ష వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చాలామంది సక్సెస్ అయ్యారు.వారిలో దివ్య శ్రీ పాద ఒకరు.కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించారీమె.సినిమాల్లో నటించడానికి భయపడి వెనకడుగు వేసిన దివ్య నట జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేదట.ఫలానా సినిమాలో ఫలానా పాత్రలో నేను నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకునేదట.అలా ఆమెకు నటనంటే ఇష్టం, ఆసక్తి ఏర్పడింది.కానీ ఎక్కడో చిన్న భయం ఉండేదట.
మనకి అంత సీన్ ఉందా? నేనేం యాక్టర్ అవుతానులే అని అనుకునేదట.అలా భయపడుతూనే, ఒకరోజు తెగించి కాలేజ్ చదువుతున్న రోజుల్లో హైదరాబాద్ లో లమాకాన్ లో జరుగుతున్న వర్క్ షాప్ కి వెళ్లారట.
లమాకాన్ అనేది ఒక టాలెంట్ అడ్డా. హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఉన్న ఈ ఓపెన్ కల్చరల్ సెంటర్ లో వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉంటారు.అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకుని, షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు తెచ్చుకుంటారు.అలా ఆ వర్క్ షాప్ కి వెళ్ళిన దివ్య, ఇంప్రెస్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ లో నటించే అవకాశం తెచ్చుకున్నారు.
ఈ విషయం ఇంట్లో చెప్తే, పేరెంట్స్ ఒప్పుకోలేదు.దీంతో ఆమె తన ఆశయాన్ని పక్కనపెట్టి చదువు మీద దృష్టి పెట్టారు.
చదువు పూర్తయ్యాక ఐబి్‌ఎం సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు.ఉద్యోగం చేస్తున్నా గాని మనసు మాత్రం యాక్టింగ్ చేయమని ప్రోత్సహిస్తుంది.

ఆ సమయంలోనే ఆమెకు పిక్చర్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చింది.పూరీ జగన్నాథ్ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి ఈ “పిక్చర్” అనే షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అయ్యింది.అప్పుడే దివ్యకి పూరీ ఒక ఆఫర్ ఇచ్చారట.మహేశ్ బాబుతో జనగణమన సినిమాలో ఓ కేరెక్టర్ ఉందని చేస్తావా అని అడిగారట.అయితే మా ఇంట్లో ఒప్పుకోరండి అని పూరీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.కానీ మనసులో మాత్రం నటించాలి అన్న కోరిక మాత్రం చావలేదు.
సినిమా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఎలా అని రెండు నెలలు ఆలోచించారట.అప్పుడే యూట్యూబ్ లో వీడియోలు చూడడం, రకరకాల ఛానల్స్ యొక్క కంటెంట్ ను ఫాలో అవ్వడం వంటివి చేసేవారట.
అలా ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు.
ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఆమె ధైర్యంగా తన నట జీవితాన్ని ప్రారంభించారు.
ఆమె చేసిన మొదటి వీడియో “గర్ల్స్ ఆన్ పీరియడ్స్” బాగా హిట్ అయ్యింది.దీంతో ఆమెకు కాన్ఫిడెన్స్ పెరిగింది.రెండో వీడియో నుంచి రైటర్ గా కూడా ప్రమోట్ అయ్యారు.30 వీడియోలకు కంటెంట్ రాసిన దివ్య, ఇప్పటివరకూ వందకు పైగా వీడియోల్లో నటించారు.కానీ ఆమెకు సంతృప్తి లేదు.సినిమాల్లో నటిస్తే ఆ కిక్కే వేరనుకున్నారు.అవకాశాల కోసం ఎదురుచూశారు.అదే సమయంలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత మిస్ ఇండియా, మిడిల్ క్లాస్ మెలోడీస్, గుడ్ లక్ సఖి, జాతిరత్నాలు, కలర్ ఫోటో వంటి సినిమాల్లో నటించారు.కలర్ ఫోటో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
అలా ఈ తెలుగమ్మాయి భయపడుతూనే సినిమాల్లో అడుగుపెట్టారు.మొత్తానికి తెగించి ఒకడుగు ముందుకు వేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె మరిన్ని సినిమా అవకాశాలు రావాలని, మంచి స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం.