ప్రైవేట్ అంబులెన్స్( Private Ambulance ) నిర్వాహకుల నిర్లక్ష్యం,వర్గ పోరు పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వెలుగులోకి వస్తున్నాయి.ప్రజల ప్రాణాలకన్నా తమ లాభాపెర్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఆర్టీవో,విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు
ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక వర్గం వారు పెషేంట్లను తీసుకువెళుతుంటే మరొక వర్గం అంబులెన్స్ ను ఆపి గొడవపడి విలువైన వైద్య సమయాన్ని వృధాచేయడంతో పెషేంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనిఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణంలో ఇటీవల గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్సు నిర్వాహకుల మధ్య వర్గపోరుతో పేషెంట్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.అత్యవసర సమయంలో పెషేంట్ లను ఆదుకోవలసిన అంబులెన్సులు గొడవలు పడుతూ పెషేంట్ల ప్రాణాల మీదికి తీసుకొస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఆసుపత్రులలో ప్రాణాపాయ స్థితికి వస్తే వారిని మెరుగైన చికిత్స కోసం తరలించేందుకు నిత్యం అంబులెన్సులను వినియోగిస్తారు.అలాంటి వ్యవస్థలో మిర్యాలగూడలోఅనుమతులు లేని అంబులెన్సు వినియోగిస్తున్నట్లు సమాచారం.రిజిస్ట్రేషన్ పత్రాలు,ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పెషేంట్లను ఆసుపత్రులకు తరలిస్తు పెషేంట్ బంధువుల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బుల వసూళ్లకు పాలుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.అంబులెన్సులో కనీస సౌకర్యాలు లేకుండా వాహనాలు నడుపుతున్న తీరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని అంటున్నారు.
కనీస నిబంధనలు పాటించకుండా వాహనాలను నడుపుతున్నారని,ఫార్మ్ 22 ప్రకారం రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు నడపాలి.కానీ, అవేమి పాటించకుండా ఇష్టానూసారంగా వ్యవహారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కంపెనీ వారు అంబులెన్సు తయారీ సమయంలో ఆక్సిజన్ సిలిండర్,పేషేంట్ రక్షణ సామాగ్రి,ఎయిర్ బ్యాగులు, వాహనాలల్లో పొందుపరిచి వాహనాలు పంపడం జరుగుతుంది.వాటిని అన్నిటిని అమ్ముకొని అందులో ఎలాంటి పరికరాలు లేకుండా అంబులెన్సు వాహనాలు నడుపుతున్నారట.
అట్టి వాహనాలు గుర్తించి సామాన్య ప్రజలకు మేలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇటీవల ప్రముఖ హాస్పిటల్ లో అంబులెన్సు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది.
పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారా అని ప్రశ్నిస్తున్నారు.ఇంత జరుగుతున్నా రవాణా శాఖ,విజిలెన్స్ అధికారులు మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్వాహకులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.