నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట గండి నిర్మాణ పనులు ఆలస్యం కావవడంతో పంట నస్టపోయిన రైతులతో పాటు నీళ్లు లేక పంటలు ఎండుతున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు.సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద లక్షల ఎకరాల వరి సాగు చేసుకున్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు వారాలవుతున్నా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే కానీ,జిల్లా మంత్రి కానీ,అధికారులు కానీ, పట్టించుకున్న నాథుడే లేడని ఆరోపించారు.
ఈ సమస్యపై రైతులకు కనీసం భరోసా ఇచ్చింది లేదని అన్నారు.ఇది కాక కట్ట తెగినప్పుడు పొలాల్లో ఇసుక పేరుకుపోయి పంటలు తీవ్రంగా ఆ నష్టపోయారని,ఆ ఇసుక మేటలను తీసివేయాలంటే రైతులకు లక్షలలో ఖర్చు వస్తుందని,దానికి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరమ్మతులు పూర్తి కాక నీరు విడుదల చేయకపోవడంతో వరి నాట్లు వేసుకున్న రైతుల పొలాలు దాదాపుగా ఎండిపోయే స్థితికి వచ్చాయని అన్నారు.కాలువ కట్ట నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేసి రైతులకు వీలైనంత త్వరలో నీరు అందివ్వాలని డిమాండ్ చేశారు.
కట్ట నిర్మాణ పనులలో సౌడుమట్టి,సుద్దరాయిని వాడుతున్నారని తెలుస్తోంది.అది కాకుండా నాణ్యమైన మట్టి వాడి మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
నష్టపోయిన రైతులకు 48 గంటలలో నష్టపరహారం చెల్లించాలని, లేనియెడల బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్,కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.