నల్లగొండ జిల్లా:గురువారం సాయంత్రం నుండి విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.కానీ,నాగార్జున సాగర్(నందికొండ)లో శుక్రవారం ఉదయం నుండే వర్షం మొదలైంది.
ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే అంతర్గత రోడ్లన్నీ చిత్తడై బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రపంచ పర్యాటక కేంద్రమైన నందికొండలో అంతర్గత రోడ్లను చూస్తే పర్యాటకులు ఔరా అని ముక్కున వేలేసుకోవడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన ప్రదేశమైన నాగార్జునసాగర్ పరిస్థితి చిన్నపాటి వర్షానికే జలమయమై పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారిందని అంటున్నారు.నూతనంగా నందికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నుండి ఆరు కోట్ల రూపాయల నిధులతో కొన్ని రోడ్లను వేశారు.
కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆరు నెలల లోపే గుంతలుపడి,చిన్నపాటి వర్షం కురిస్తే ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచి రోడ్లన్ని బురదతో నిండిపోయాయి.దీంతో పాదచారులు ఆ రోడ్డుపై నడవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
కోట్ల రూపాయల ప్రజా ధనంతో ఏర్పాటు చేసిన రోడ్లు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలలకే దెబ్బతిన్నాయని,అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది అంటున్నారు.ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పాడైన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాలు చేయాలి.-చరక యాదగిరి,సామాజిక కార్యకర్త.
నాగార్జునసాగర్ లో అంతర్గత రోడ్లు అద్వానంగా తయారయ్యాయంటే గతంలో రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే.రోడ్లన్నీ కంకర్ తేలి గుంతలు ఏర్పడి మూడు అడుగుల లోతులో నీళ్ళు నిలిచాయి.
రోడ్ల వెంబడి నడిచే పాలచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.నాణ్యత ప్రమాణాలతో రోడ్లు నిర్మాణం చేపడితేనే ఈ సమస్య తీరుతుంది.