నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని పలు గ్రామాల అంతర్గత రహదారులు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోక గుంతలు పడి అత్యంత అద్వాన్నంగా తయారయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గుంతలు పడి నీళ్ళు నిలిచిన రోడ్లపై రాకపోకలు కష్టంగా మారిందని,వర్షాకాలం కావడంతో చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడిగా మారి ప్రమాదకరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
వాహనదారులు,ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో తీవ్ర అవస్థలు పడుతున్నామని,నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్ అండ్ బీ రహదారులు సైతం దెబ్బతిని గోతులుగా మారినా పట్టించుకునే వారే లేరని,
దీనికి తోడు ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లలో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.చెరువుపల్లి గ్రామంలో రోడ్లన్నీ గుంతల మయమై ఆ దారి గుండా కనేకల్లు,దాచారం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.