నల్గొండ జిల్లా:వయస్సుతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పూజిస్తూ ఉత్సాహంగా నిర్వహించే పండుగ వినాయక చవితి.ఆ ఆది దేవుడైన గణనాథుని పండుగ వచ్చేసింది.
ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంబురాలకు ఉత్సాహ కమిటీలు,భక్తులు సన్నద్దమయ్యారు.ప్రతి ఏడు జిల్లాలో లెక్కలేనన్ని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి మూడు రోజుల నుంచి పదహారు రోజుల వరకు జరుపుకుంటారు.
కానీ,ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన రంగురంగుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.వాటిని వల్ల పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలుగుతుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ,భక్తులు,ఉత్సాహ కమిటీలు వారి ఆవేదనను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించి కేవలం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని కోరుతున్నారు.
పూర్వకాలం కాకతీయుల కాలంలో రాతి వినాయక విగ్రహాలు అక్కడే పూజలు అందుకొని ఎవరికి హామీ కలుగకుండా ఉండేది.కాలక్రమేణా మట్టి విగ్రహాలు అందుబాటులోకి వచ్చాయి.
వర్షాకాలం మధ్యలో వచ్చే ఈ వినాయకుడి పండుగ నాటికి చెరువులు కుంటలు,వాగులు,వంకలు నిండి ఉంటాయి.అందులో ఉండే వండ్రు మట్టితో తయారు చేయబడే మట్టి విగ్రహాలు ప్రకృతికి ఎంతో ప్రయోజనం చేస్తాయని పర్యావరణ పరిరక్షణ సంస్థలు,ప్రకృతి ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
అయినా నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మట్టి వినాయకుల పూజించే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో వీధి వీధిన వినాయక విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం.
డీజేల మోతలతో శబ్ద కాలుష్యాన్ని కూడా విపరీతంగా పెంచుతున్నాం.అన్ని విధాలా మానవ సమాజానికి మేలు జరగాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించి,మట్టి విగ్రహాలను పూజించాలని పలువురు కోరుతున్నారు.
నేడు మనం వాడే ప్రతి వస్తువు రసాయనంతో కూడినదై ఉంటుందని,ఇప్పటికైనా అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను బహిష్కరించి,మట్టి వినాయకులకు జేజేలు పలుకుతూ పూజలు చేస్తారని,చేయాలని ఆశిద్దాం.