నల్లగొండ జిల్లా:వేములపల్లి మండల మియామత్ ఖాన్ చెరువును నుండి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జేసీబీలతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం పరిధిలోని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తూ కొత్తగా వేసిన రోడ్డు ధ్వంసం చేస్తున్నారని,ఈ ఇటుక బట్టీల నుండి వెలువడే కాలుష్యం వల్ల గ్రామంలో 70 % పైగా వివిధ రకాల అనారోగ్యం బారిన పడ్డామని గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ అధ్వర్యంలో మట్టి టిప్పర్లను అడ్డుకొని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటుక బట్టీలకు నిరంతరం మట్టి,బూడిద తరలించడం వల్ల ఇళ్లలో భోజనం కూడా తినే పరిస్థితి లేదని,వర్షం పడితే రోడ్డుపై నిడిచే అవకాశం లేదని,ఈ రోజు టిప్పర్ పై నుంచి మట్టి పెళ్లలు ద్విచక్ర వాహనంపై పడ్డాయని,ఎలాంటి ప్రమాదం జరగలేదని,ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని వాపోయారు.
కొందరు స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని,ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో ఇటుక బట్టీలు నడుపుతున్నారని,మట్టి మాఫీయా పర్మిట్ ఒకరికి మట్టి తరలించేది మరొకరికని, అయినా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి, ఇటుక మాఫియాను మా గ్రామ పరిధిలోకి రాకుండా చూడాలని తమ గోడు వెళ్ళబోసుకన్నారు.
ఈ సంఘటనను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను మట్టి మాఫీయా వారు బెదిరించడం కొసమెరుపు.