బ్లఫ్ మాస్టర్ సినిమా చూపించిన కేటుగాళ్ళు.ఐదుగురికి రిమాండ్,పరారీలో ఇద్దరు.
వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ.నల్లగొండ జిల్లా:బ్లప్ మాస్టర్ సినిమా చూసి,అదే స్టైల్లో కోట్లు సంపాదించాలని అమాయకులను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను నల్లగొండ పోలీసులు కటకటాల్లోకి పంపించారు.నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నర్సింహారెడ్డి నిందితులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.హైదరాబాద్ లోని నేర్రపట్లకు చెందిన డ్రైవర్ వృత్తిలో కొనసాగుతున్న ఆరోజు లక్ష్మినారాయణ,వినాయక్ నగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు కొండారపు నాగరాజు,ఎల్బీనగర్ కు చెందిన శ్యాంపురం మురళీమోనోహర్,ఎల్బీనగర్ కు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి వర్తియా లక్ష్మణ్ నాయక్, నారాయణపేట జిల్లా కేంద్రంలో హమాలి పనిచేసే సందుల రవి,ఇబ్రహింపట్నంకు చెందిన పరుశురాం, శర్మలు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
వారంతా వేర్వేరు ప్రాంతాల్లో బ్లప్ మాస్టర్ సినిమా చూసి,వారికున్న పాత పరిచయాల ద్వారా ముఠాగా ఏర్పడి ఎలాగైనా డబ్బును సులభంగా సంపాదించాలని ప్లాన్ వేసుకున్నారు.ప్రధాన నిందితు ఆరోజు శ్రీనివాస్ వైన్ షాపుల్లో మద్యం తాగే వారి దగ్గరకు వెళ్లి వారిపేర్లపై సిమ్ కార్డులను కొనుగోలు చేసేవాడు.
కొత్త నెంబర్ ద్వారా నల్లగొండకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన పొలంలో రైస్ పుల్లింగ్ మహిమగల చెంబుదొరికిందని,ఎవరికన్నా కావాలంటే చెప్పాల్సిదిగా కోరాడు.ఓ వారం తర్వాత పథకం ప్రకారం నిందితుల్లో ఒకడైన నాగరాజు శ్రీనివాస్ కు ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ మహిమగల చెంబు ఉంటే తాను కొనుగోలు చేస్తానని చెప్పగా,తన వద్ద ఒక చెంబు ఉన్నదని పేర్కొంటాడు.
దీంతో కంపెనీ తరుఫున ఓ వ్యక్తిని పంపిస్తున్నానని,అతడు చెంబును పరిశీలించి మహిమగలదని నిర్ధారణ చేసుకున్నాకే కొనుగోలు చేస్తామని నాగారాజు శ్రీనివాస్ కు వివరిస్తాడు.వెంటనే శ్రీనివాస్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తనకు మహిమగల చెంబు కావాలని కోరగా,రూ.9 లక్షలు అవుతుందని చెప్పాడు.ఇరువురు కలిసి రూ.4.60 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.పథకం ప్రకారం లక్ష్మీనారాయణ తమ ముఠాలోని మరో ఇద్దరు నిందితులైన లక్ష్మణ్,సందుల రవిని మల్లేపల్లికి పంపించాడు.శ్రీనివాస్,లక్ష్మణ్,రవి అదే పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో కలుసుకున్నారు.లక్ష్మణ్,రవిలు శ్రీనివాస్ కు చెంబును ఇచ్చి ఒప్పందం ప్రకారం రూ.4.60 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తారు.శ్రీనివాస్ చెంబును తీసుకుని ముందుగా మహిమగల చెంబు గురించి ఫోన్ ద్వారా మాట్లాడుకున్న నాగారాజుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఆ ముఠా సభ్యులందరి ఫోన్లకు ఫోన్ చేయగా ఎవరి ఫోన్ కూడా కలవలేదు.దీంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాస్ ఏప్రిల్ 26న నల్లగొండ టూటౌన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అప్పటి నుంచి నిందితులకోసం గాలిస్తుండగా సోమవారం ఉదయం పానగల్ బైపాస్ లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కారులో వస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు.వారు పొంతన లేని సమాధానం చెబుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు ఒప్పుకున్నారు.
ఐదుగురు నిందితులు పట్టుబడగా,శర్మ,పరుశురాంలు పరారీలో ఉన్నారు.వారి వద్దనుంచి ఒక కారు,ఐదు సెల్ ఫోన్లు,మూడు చెంబులు,తొమ్మిది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని,నిందితులను రిమాండ్ కు తరలించారు.
కాగా,శ్రీనివాస్ నుంచి తీసుకున్న డబ్బుును ముఠాసభ్యులు సమానంగా పంచుకుని ఖర్చు చేసుకున్నారు.