ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1600 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అమరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వంలో కనీసం గౌరవం కూడా దక్కడం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు.తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఆవిర్భవించి తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా శుక్రవారం నల్లగొండ పట్టణం( Nalgonda )లో తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అమరులను స్మరించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ అమరుల కుటుంబాలకి ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలతో సరిపెట్టారని, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనైన నీళ్లు,నిధులు, నియామకాల సమస్యలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు.సమైక్య పాలనలో కృష్ణానదీ జలాలలో ఎంత వాటర్ దక్కిందో స్వరాష్ట్రంలో కూడా అంతే వాటా దక్కుతుంది తప్ప అదనంగా ఒక టీఎంసీ కూడా రాలేదన్నారు.
ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొట్లాడి సాధించలేదన్నారు.తెలంగాణలో మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులను పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.
అసెంబ్లీలో మాత్రం బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి.కానీ, ఆచరణలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కావడం లేదని, దక్షిణ తెలంగాణ వివక్షకు గురవుతుందన్నారు.
ఆరు లక్షల కోట్ల అప్పు చేసినా తెలంగాణలో అభివృద్ధి జరుగ లేదని,ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్లే మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరావులే నేడు తెలంగాణ నిధులను దోచుకుపోతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు అన్నింటి విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ యువత కొట్లాడిందే ఉద్యోగాల కోసమని,కానీ, ఇంతవరకు ఒక జంబో నోటిఫికేషన్ కూడా వేసింది లేదన్నారు.
నిరుద్యోగులను ఆదుకున్న దాఖలాలు లేవని,అరాకొరా పోలీసు ఉద్యోగాలు తప్ప నిరుద్యోగ యువత<,( Un employed youth ) ఆశించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు.తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినప్పుడే తెలంగాణ అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రేఖల సైదులు, బొజ్జ దేవయ్య,మాసారం వెంకన్న,బొజ్జ నాగరాజు, కొంపెల్లి రామన్న గౌడ్ నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.