నల్లగొండ జిల్లా:అధికార పార్టీ వాహనాలపట్ల పోలీసు చెక్ పోస్టుల వద్ద కొనసాగుతున్న వ్యవహారం సరైంది కాదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియోజకవర్గం చుట్టూ సుమారు 14 పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి,అన్ని రకాల వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ లోపలికి అనుమతిస్తుంది.
అయినా నియోజకవర్గంలో డబ్బు,మద్యం ఏరులై పారుతోంది.ఇదంతా ఎట్లా లోపలికి వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇదిలా ఉంటే మూడు రోజులు క్రితం పోలీసు చెక్ పోస్టు నుండి భారీ కాన్వాయ్ తో వస్తున్న విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాన్వాయ్ ని ఆపకుండా అక్కడున్న సిబ్బంది మంత్రికి సెల్యూట్ చేస్తూ వదిలేయడంపై అనేక విమర్శలు వచ్చాయి.గతంలో టీఅర్ఎస్ పార్టీకి చెందిన ఓ మంత్రి వెహికిల్ ను రాత్రి పూట ఎలాంటి చెకింగ్ చేయకుండా వదలడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని కూడా తనిఖీలు చేయకుండానే పంపించడంతో చెక్ పోస్ట్ సిబ్బందిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఫైరయ్యారు.చింతపల్లి మండలం వెంకటంపేట చెక్ పోస్ట్ వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాలను చెక్ చేయకుండానే చెక్ పోస్ట్ సిబ్బంది పంపించడం, చెక్ పోస్ట్ సిబ్బంది అధికార పార్టీని చూసి చూడనట్టు వదిలేస్తున్న వైనంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇతర వాహనాలను మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు,అధికార పార్టీకి చెందిన వాహనాలను ఎందుకు వదిలేస్తున్నారు? వారికి ఎన్నికల కోడ్ వర్తించదా?ఇదెక్కడి చోద్యమని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గరమవుతునారు.ఇలాంటి ఘటనలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.