నల్లగొండ జిల్లా:సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని,వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.మల్లు స్వరాజ్యం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డికి సోదరి కాగా,మరో సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకట నర్సింహా రెడ్డికి సతీమణి కావడం గమనార్హం.
ఆమె సీపీఎం పార్టీ నుండి ఎమ్మెల్యే గానూ పనిచేశారు.మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం,ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలకు ఊపిరి పోస్తున్నారు.
ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేస్తున్న మల్లు నాగార్జున రెడ్డి ఆమె కుమారుడే కావడం విశేషం.ఆమె కోడలు మల్లు లక్ష్మీ కూడా సీపీఎం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా పని చేస్తున్నారు.