నల్లగొండ జిల్లా: మర్రిగూడ మండల కేంద్రంలోని ఎస్సీ,బీసీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.గృహాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఎస్టీ వసతి గృహానికి మాత్రమే సొంత భవనం ఉన్నది.అద్దె భవనాల్లోని ఇరుకు గదులతో పాటు మరుగుదొడ్లకు,స్నానపు గదులకు పై కప్పు, తలుపులు లేక అపరిశుభ్రంగా ఉన్నాయి.
దీనితో విద్యార్దులు కాల కృత్యాలు తీర్చుకోడానికి ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడింది.ఇక రాత్రి వేళల్లో బయటకు వెళ్తే విష పురుగుల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
బీసీ వసతి గృహం అద్దె భవనంలో ప్రస్తుతం 40మంది విద్యార్థులు ఉండగా ప్రతినెలా రూ.8,800, ఎస్సీ వసతి గృహం అద్దె భవనంలో ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఉండగా నెలకు రూ.10,400 అద్దె చెల్లిస్తున్నారు.ఎస్సీ వసతి గృహానికి ఒకవైపు పెట్రోల్ బంక్,మరొకవైపు ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
మరోపక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఏ టైంలో ఏం జరుగుతుందోనని విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికైనా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు,తల్లిదండ్రులు కోరుతున్నారు.