నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఒరిజినల్ పోస్టింగ్ ప్లేస్ లో కాకుండా డిప్యూటేషన్, వర్క్ ఆర్డర్లపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,డీఎం అండ్ హెచ్‌ఓ ఆఫిస్,ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు,నర్సింగ్ స్టాఫ్,పారామెడికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్లు, జూనియర్,సీనియర్ అసిస్టెంట్లు ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నియమితులైన స్థానాల్లో కాకుండా డిప్యుటేషన్లు,వర్క్ ఆర్డర్లపై వేర్వేరు చోట్ల పనిచేస్తున్న వారందరూ తక్షణమే తమ నియమిత స్థానాల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 180 మంది ఉద్యోగులు, సిబ్బంది డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.నల్లగొండ జిల్లాకు చెందిన వారు పక్క జిల్లాలో,పక్క జిల్లా వారు నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్నట్టు వెల్లడైంది.
వీరిలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు,ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు,సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు,ఆఫీస్ సబార్డినేట్లు,అటెండర్లు, డ్రైవర్లు,ఏఎన్ఎం,హెల్త్ ఎడ్యుకేటర్లు,సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు,ఆశ వర్కర్లు డిప్యూటేషన్లపై పనిచేస్తున్నవారిలో ఉన్నారని వారందరినీ నియమిత స్థానంలోకి పంపేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.