నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్దులు అమలుకు నోచుకోని హామీలను ఆశచూపిస్తూ,ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, తిమ్మినిబమ్మిని చేస్తూ ఎలాగైనా గెలవాలనే ఆరాటం తప్పా అసలు సమస్యలపై నోరు విప్పే పరిస్థితి లేదు.తెలంగాణ ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని ఆశపడిన యువతకు పదేళ్ళైనా నిరాశే మిగిలింది.
బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా,కనీసం స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయింది.కానీ,మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, తమకే ఓటేయాలని ప్రగల్భాలు పలుకుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా తామేమీ తక్కువ తినలేదని కేవలం తమను గెలిపిస్తే విద్యా,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పకుండా, ఉచితాలను ఇస్తామని,ఆ పార్టీ ఐదు ఇస్తే ఈ పార్టీ ఆరు ఇస్తామని హామీలు గుప్పిస్తూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.సమాజ వికాసం కోసం కాకుండా సమాజ వినాశనానికి ఉపయోగపడే ఉచితాలతో ప్రధాన పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలు ఉండడం సిగ్గుచేటని,ప్రజాస్వామ్య వ్యవస్థకు,భావితరాలకు గొడ్డలిపెట్టు లాంటిదని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
తమనే గెలిపించాలని ఉత్తుత్తి హామీలతో ఊదర గొడుతున్నారే తప్పా ఉపాధి మార్గాలపై ఊసెత్తే వారే కనిపించడం లేదని, తామే సుద్దపూసలం అన్నట్లుగా కలరింగ్ ఇస్తూ, పరస్పర ఆరోపణలు చేసుకుంటూ అసలు సమస్యలు తెరపైకి రాకుండా రాజకీయ డ్రామాలకు తెరతీశారని వాపోతున్నారు.ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్,సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 పైగా రసాయన,సిమెంట్ పరిశ్రమలు ఉన్నా అందులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సున్నా.
ప్రస్తుత ఎమ్మేల్యేలు గత ఎన్నికల్లో పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలంటూ హామీలిచ్చి గెలుపొందారు.కొన్ని పరిశ్రమల్లో తూతూ మంత్రంగా అవకాశాలు ఇస్తున్నా అవి కేవలం డైలీ లేబర్ కన్నా హీనంగా ఉండడం గమనార్హం.
తమ పిల్లలకు ఉపాధి ఆశించి పరిశ్రమలకు భూములిచ్చి, పర్మిషన్లకు సహకరిస్తే మా నోట్లో మట్టి కొట్టారని, పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతాలు పూర్తిగా కలుషితమై అనారోగ్యంతో బాధపడుతూ జబ్బులు మాకు జాబులు వేరే ప్రాంతాల వారికా అంటూ ప్రశ్నిస్తున్నారు.పోటీ చేస్తున్న ఏ పార్టీ అభ్యర్ధి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తామని హామీ ఇవ్వడం లేదు.
స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కలిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని పలువురు నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఊక దంపుడు ఉపన్యాసాలు,ఉత్తుత్తి హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు కొల్లగొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని చౌటుప్పల్ కు చెందిన నిరుద్యోగి ఎరుకల నరేష్ గౌడ్ అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ బడులు బంద్ పెట్టి,ఉద్యోగ నోటిఫికేషన్స్ అటకెక్కించి, గ్రూపు పరీక్షల పేపర్ లీకేజీల చేస్తూ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని, ఇప్పుడు తమ పార్టీనే పింఛన్లు,గొర్లు,బర్లు,చేప పిల్లలు,ఇచ్చిందని, మూడోసారి మమ్ముల్ని గెలిపించాలని అడగడం చూస్తుంటే పులి బోనులో తలపెట్టండి మీ ప్రాణాలకు ఫుల్ గ్యారెంటీ మాదేనని చెప్పినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష అభ్యర్దులు కూడా విద్యా,వైద్యం,సత్వర న్యాయంపై దృష్టి పెట్టకుండా ఉచిత తాయిలాలపై ఫోకస్ చేయడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడెరుగు కనీసం ఇండ్రస్త్రీయల్ ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని,ఎన్నికల ప్రచారం చేస్తున్న ఏ ఒక్క పార్టీ కూడా నిరుద్యోగ యువత సమస్యలపై మాట్లాడడం లేదని,స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతిపరిశ్రమల్లో కనీసం 70% స్థానికులకు అవకాశం ఉండే చూడాలని డిమాండ్ చేశారు.