నల్గొండజిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతి సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ జెండాకు ఘోరమైన అవమానం జరిగింది.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో నాగార్జున సాగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాతో ఇష్టానుసారంగా వ్యవహరించి జెండా ఔనత్వాన్ని దెబ్బతీశారని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్,ప్రభుత్వ అధికారులు,పోలీసులు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా వచ్చిన ప్రతీ ఒక్కరికి ఒక జాతీయ జెండాను ఇచ్చారు.ర్యాలీ ముగియగానే ప్రజల కోసం ఏర్పాటు చేసిన భోజనాలకు ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు.
దీనితో తమకు ఇచ్చిన జాతీయ పతాకాలను అక్కడే కుప్పలుగా పడేసి భోజనాలకు పరుగులు తీశారు.కింద పడేసిన జాతీయ జెండాలను తొక్కుతూ వెళుతున్నా కనీసం వాటిని ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ జెండా అంటే ఏమిటో కూడా తెలియని అమాయక ప్రజలకు గౌరవప్రదమైన జాతీయ పతాకాన్ని ఇవ్వడంతో వారికి దాని విశిష్టత తెలియక కిందపడేసి,తొక్కుతూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మంది అమరవీరుల త్యాగఫలితంగా రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండా ప్రభుత్వాల అసమర్థత,నిర్లక్ష్యం కారణంగా అవమానాల పాలవుతుందని వాపోయారు.జాతీయ జెండాను అవమానం జరిగేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేసులు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.