నల్లగొండ జిల్లా:ప్రైవేటు పాఠశాలల అక్రమ ఫీజుల దందాను అరికట్టి విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి, విద్యార్థులను,తల్లిదండ్రులను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్మిషన్ల జరిగేటప్పుడు తక్కువ ఫీజులు తీసుకుంటామని నమ్మించి,అడ్మిషన్ అయిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రైమరీ విద్యార్థులకే రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని,వ్యాన్ ఫీజు, బుక్స్,డ్రెస్సు,షూ,టై,బెల్టు పేరుతో మరో 25 వేలు వసూలు చేస్తూ విద్యావ్యాపారానికి పాల్పడుతున్నారని అన్నారు,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నా,పేద విద్యార్థుల తల్లిదండ్రుల సంపాదన,వారి ఫీజులకు కూడా చాలడంలేదని,పై తరగతులకు వెళ్లే కొద్దీ మరింత ఫీజుల భారం పెంచుతున్నారని అన్నారు.పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులిచ్చి పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు.
పేదలకు అందుబాటులో ఉండాల్సిన విద్య,కార్పొరేట్ వ్యాపారం అయిందని,వెంటనే అధికారులు చర్యలు తీసుకొని, విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేసి,అధిక అక్రమ ఫీజులను నియంత్రించి,పేదలకు విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు వింజమూరి శివ,ఆరెకంటి రాము,భాషపాక శ్రీను, వింజమూరి పుల్లయ్య,కందుల పరమేష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.