నల్లగొండ జిల్లా:ప్రస్తుత పరిస్థితుల్లో జియో,ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్ చార్జీలు విపరీతంగా పెంచడంతో ప్రభుత్వ టెలికం సేవలు సరసమైన అఫర్లతో ఉన్నాయని ప్రజలు బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ ను ఎంచుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో గత కొద్ది రోజులుగా బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు చాలా చోట్ల సిగ్నల్స్ సరిగా రాక,ఇంటర్నెట్ కూడా చాలా స్లోగా వస్తోందని సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక టెలికాం శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఇతర నెట్ వర్క్ లోకి మారడం మినహా గత్యంతరం లేని పరిస్థితి దాపురించిందని, మండల కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం గత కొన్ని నెలల నుండి మూతపడడం,సెల్ టవర్స్ ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయాయని వినియోగదారులు వాపోతున్నారు.
సిగ్నల్స్ లేనప్పుడు స్పెషల్ ఆఫర్లను పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇక గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ టవర్లు పూర్తిగా ఎత్తేయడంతో వేయడంతో సిగ్నల్స్ అందక కొందరు,విద్యుత్ సరఫరా ఆగిపోయి కొన్ని ప్రాంతాల్లో సెల్ సేవలు దూరమవడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ను వదిలి ఇతర సేవలు వైపు దృష్టి పెడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి సెల్ వన్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుని సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే బిఎస్ఎన్ఎల్ సేవల మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు వస్తాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.