నల్గొండ జిల్లా:35 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి.ధరణిలో పాత యజమాని పేరు.
దానిని ఆసరా చేసుకొని వేరే వాళ్ళకి అమ్మిన వైనం.న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ధర్నా.
వర్షంలో సైతం దీక్ష చేస్తున్న మహిళ క్షీణీస్తోన్న ఆరోగ్యం.గత 5 రోజుల నుండి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న మర్రిగూడ మండలం శివన్న గూడెం గ్రామానికి చెందిన దళిత మహిళ గోల్కొండ రాధమ్మ పరిస్థితి విషమంగా మారుతుంది.
అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆమెకు రాజకీయ పక్షాలు,ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి.వివరాల్లోకి వెళితే 35 సంవత్సరాల క్రితం ఇందుర్తి రెవెన్యూ పరిధిలోనీ సర్వే నెంబర్ 920 లో చిట్యాల స్తంభారెడ్డికి చెందిన 20 గుంటల వ్యవసాయ భూమిని గోల్కొండ రాధమ్మ కొనుగోలు చేసింది.
ఆ భూమిలో అప్పటి నుండి కబ్జాల్లో ఉండి,సాగు చేస్తున్నది.ఈ మధ్య ఆ భూమిలో పందుల పెంపకం, ఇటుకల తయారు చేపట్టి జీవితం కొనసాగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ ఆమె పాలిట శాపంగా మారింది.ఈ ధరణిలో పోర్టల్ లో ఉన్న లొసుగుల ఆధారంగా రాధమ్మ పేరు మీద ఆ భూమి పట్టా కాకుండా పోయింది.
ధరణిలో ఉన్న విధంగా 35 ఏళ్ల క్రితం అమ్మిన వ్యక్తికే అధికారులు తిరిగి పట్టా ఇచ్చారు.స్తంభారెడ్డి అనే వ్యక్తి అధర్మంగా అమ్మిన భూమిని ఆక్రమించుకొని,దాన్ని ఇళ్ల స్థలాల రూపంలోకి మార్చి తిరిగి వేరే వాళ్లకు విక్రయించాడు.
ఈ విషయం తెలుసుకున్న రాధమ్మ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగింది.అది తాను 35 సంవత్సరాల క్రింద తన కష్టంతో కొనుగోలు చేశానని నెత్తి నోరు బాదుకుంది.
ఎన్నిసార్లు అధికారులకు తన గోడు వెళ్ళబోసుకున్నా అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది.ఇక చేసేదేమీ లేక మండల తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకొని తనకి న్యాయం చేయాలంటూ ఐదు రోజుల క్రితం ధర్నాకి దిగింది.
ఈ ధరణి వల్ల తనకు తీరని అన్యాయం జరిగిందని ఆ మహిళ వాపోతుంది.ఎలాగైనా పై అధికారులు జోక్యం చేసుకొని రికార్డులను పరిశీలించి తనకు తగు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
ఈ సమయంలోనే వర్షాలు కురుస్తున్నాయి.ఒకవైపు తిండి లేక,మరోవైపు వానలతో ఆమె ఆరోగ్యం క్షీణీస్తోంది.
రెండు రోజుల క్రితం దీక్షా శిబిరంలోనే పడిపోతే స్థానిక విపక్షాల నేతలు ఆమెకు ప్రైవేట్ డాక్టర్ తో వైద్యం చేయించారు.అయినా రాధమ్మ తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా తిరిగి ధర్నా కొనసాగిస్తుంది.
ఆ మహిళ చేసే పోరాటానికి మద్దత్తుగా పలు రాజకీయ పార్టీలు నాయకులు ఆమెకి సంఘీభావం తెలియజేశారు.రాధమ్మకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.