నల్లగొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు చివరి దశకు చేరుకుంది.2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ కేసు విచారణలో తుది తీర్పు ఈ నెల 10న రెండవ అదనపు సెషన్స్ కోర్టు అండ్ ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించనున్నట్లు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసుపై వచ్చే తీర్పు ఎలా ఉంటుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో అమ్మాయి తండ్రి మారుతిరావు సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే.
ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.కేసు విచారణ నడుస్తుండగానే అమ్మాయి తండ్రి,ఏ1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం కూడా విధితమే.
ఈ కేసులో వచ్చే తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.