నల్లగొండ జిల్లా: వేములపల్లి( Vemulapally ) మండల కేంద్రంలో అనాదిగా ఉన్న ఎస్సీ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక సమస్యలకు నిలయంగా మారిందని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో వైకుంఠధామం( Vaikunthadham ) కట్టించినా అందులో దహన సంస్కారాలకు మాత్రమే అవకాశం ఉండడంతో ఎస్సీ స్మశాన వాటికలో పూడ్చి పెడతామని తెలిపారు.
గతంలో కొంత నిధులు విడుదలైతే ఒక భాగం గోడ కట్టి సరిపెట్టారని,చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో అందులో బహిర్భూమికి వెళుతున్నారని,చెట్లు మొలిచి అడవిని తలపిస్తోందని, అంత్యక్రియలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.ఎవరైనా చనిపోతే ఏపుగా పెరిగిన చెట్లను మృతిని కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో జెసిబిలు పెట్టి చదును చేసుకొని ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని,కనీసం స్నానాలు చేయడానికి స్నానవాటికలు కూడా లేవన్నారు.
మేము బ్రతికున్నప్పుడు బాధలు పడి,చావులో కూడా సమస్యలు పడాలా?అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు,నాయకులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి స్మశాన వాటికకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మా బాధను ఎవరికి చెప్పినా పట్టించుకునే వారేలేరని అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పుట్టల అనిల్( Puttala Anil ) వాపోయారు.స్మశాన వాటిక సమస్యల గురించి ఎమ్మెల్యే,సర్పంచ్, కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
నాయకులకి మా ఓట్ల అయితే కావాలి కానీ,మా సమస్యలు పట్టడం లేదని, కుటుంబంలో మనిషిని కోల్పోయి ఉన్న వారే అదనపు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి దళిత వాడ స్మశాన వాటికలో స్నానపు గదులు ఏర్పాటు చేసి,ప్రహరీ గోడ పూర్తి చేసి,స్నానవాటికలు నిర్మించి గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.