దొడ్డిదారిన సరిహద్దులు దాటి తమ దేశంలోకి అడుగుపెడుతున్న విదేశీయులపై అమెరికా( America ) కన్నెర్ర చేస్తోంది.సరైన పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తోంది.
అలా బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో భారతీయులు( Indians ) కూడా ఉంటున్నారు.గడిచిన ఏడాది కాలంగా 1100 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కి( Department of Homeland Security ) చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
మెక్సికో, కెనడియన్ సరిహద్దులను దాటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీహెచ్ఎస్ బోర్డర్ అండ్ ఇమ్మిగ్రేషన్ పాలసీ అసిస్టెంట్ సెక్రటరీ రాయిస్ బెర్న్ స్టెయిన్ ముర్రే( Royce Bernstein Murray ) హెచ్చరించారు.సెప్టెంబర్ 30న ముగిసిన 2024 ఆర్ధిక సంవత్సరంలో అమెరికా 1100 మంది భారతీయులను స్వదేశానికి తిప్పి పంపినట్లుగా ఆమె పేర్కొన్నారు.చివరిగా అక్టోబర్ 22న 100 మంది అక్రమ వలసదారులను( Illegal Migrants ) ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపినట్లు బెర్న్ చెప్పారు.
చట్టబద్ధమైన పత్రాలు లేనివారే కాదు, వీసా గడువు ముగిసిన వారిని కూడా అమెరికా నుంచి బహిష్కరిస్తామని ముర్రే అన్నారు.అలాగే చట్టబద్ధంగా అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి తీవ్రమైన నేరానికి పాల్పడితే అలాంటి వారికీ ఇదే రకమైన శిక్షను విధిస్తామని ఆమె అన్నారు.ఈ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్‌లో దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విమానం సరిగ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి బయల్దేరిందన్నది మాత్రం తెలియరాలేదు.భారీ ఛార్టర్డ్ విమానాలలో సాధారణంగా 100 మంది వరకు ప్రయాణీకులు ప్రయాణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కెనడా, మెక్సికోల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు 1,60,000 మంది వ్యక్తులను అమెరికా బహిష్కరించింది.ఇందులో భారత్ సహా 145 దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇందుకోసం 500కు పైగా ప్రత్యేక విమానాలను నడిపినట్లుగా సమాచారం.