నల్లగొండ జిల్లా:దళితబంధు పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు.శనివారం ఆమె నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్ పల్లి మండలం బాకిగూడెం,బెండలపహాడ్ గ్రామాల్లో పర్యటించి,దళిత బంధు బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు అర్హులైన వారికి కాకుండా నచ్చిన వారికి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.బెండలపహాడ్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు వంగాల రామలింగస్వామి దళిత బంధు కోసం గ్రామ సర్పంచ్ ని సంప్రదించగా నువ్వు ఏమన్నా టిఆర్ఎస్ కార్యకర్తవా?రోజూ మా వెంట తిరుగుతావా? వంద ఓట్లు వేయిస్తావా? ఇవన్నీ చేయనివాడివి నీకెందుకు దళిత బంధు ఇవ్వాలని అనడం సిగ్గుచేటన్నారు.ప్రభుత్వ సొమ్ముని ఇష్టమొచ్చినవారికివ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనన్నారు.దళిత బంధు పథకం రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఇవ్వాలని హైకోర్ట్ చెప్పినప్పటికీ అనుయాయులకు మాత్రమే ఇవ్వడం కోర్టు ధిక్కారమేనన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే ప్రతీఒక్కరికి దళిత బంధు ఇస్తామని మాయమాటలు చెప్పి పార్టీలో చేరికలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలాగే అన్ని పథకాలు మోసపూరితమేనని,ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు.అసలు దళిత బంధు పథకం యొక్క గైడ్ లైన్స్ ఏంటో ప్రజలకు తెలియచేయాలని,దళితుల్లో నూటికి తొంభై మంది నిరపేదలేనని వారందరికీ దళిత బంధు వర్తింపజేయాలని,టిఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా నిజమైన అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,ఉపాదక్షులు పావిరాల నర్సింహ యాదవ్,నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.