నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లాతో సహా ఖమ్మం వరకు బీడు భూములను సశ్యశ్యామలం చేస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాదా ? మా ప్రభుత్వం వేసిన రోడ్లపై నడవద్ధని పదేపదే ప్రచారం చేస్తున్న నేతలకు సాగర్ ప్రాజెక్ట్ నీళ్లను వాడుకుంటున్న విషయం గుర్తుకు రావట్లేదా అని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.మంగళవారం మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ నుంచి గుర్రప్పగూడెం,చిన్నగూడెం,చర్లగూడెం,భీమనపల్లి మీదుగా కల్వెలపాలెం, రావులపెంట వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆయన మాట్లాడుతూ పేద,మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో చేరి గంటల తరబడి ప్రిపేరై టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లలో పలు ఉద్యోగాలకు పరీక్షలను రాస్తే చివరకు ప్రశ్నపత్రాలను అమ్ముకుని నిరుద్యోగులను రోడ్డున పడేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ప్రశ్నించే వాళ్ళను జైల్లో పడేసి, నిరంకుశ పాలన చేస్తున్నారని అన్నారు.జోడో యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించేందుకు వీలుంటుందన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు.ఇదిలా ఉంటే దామరచర్ల మండలంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జోడో యాత్ర ప్రారంభమైంది.
మాడ్గులపల్లి మండలంలో చేపట్టిన జోడో యాత్రలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి,జెడ్పీటీసీ పుల్లెంల సైదులు,వెంకట్ రెడ్డి,అంజన్ కుమార్, కృష్ణారెడ్డి,మారయ్య, చింతకాయల సతీష్, జానయ్య,డానియేల్ తదితరులు పాల్గొన్నారు.