సూర్యాపేట జిల్లా:365వ జాతీయ రహదారి 6 వరసల నిర్మాణంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండలం పిల్లలమర్రి రెవెన్యూ పరిధిలోని కేతినేని చెరువు అలుగు నీరు ప్రవహించే వాగును ఆక్రమించి రహదారి నిర్మించడాన్ని నిలుపుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా సిపిఎం కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో బాధిత రైతులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ మోహన్ రావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జాతీయ రహదారి 365 బిబి రహదారి నిర్మాణంలో భాగంగా సర్వేనెంబర్ 823 పిల్లలమర్రి రెవిన్యూ శివారులోని కేతినేని చెరువు అలుగు నీరు ప్రవహించే 40 ఫీట్ల వెడల్పు గల దానిలో గత వంద సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్ద వాగును సుమారు 250 మీటర్ల దూరం వరకు పూడ్చి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని అన్నారు.ఇట్టి విషయమై అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
కాంట్రాక్టర్ వాగులు పూర్తిగా ఆక్రమించడం వల్ల 2022 జనవరిలో కురిసిన అకాల వర్షాల కారణంగా వాగులో నీరు పట్టక మొత్తం నీళ్లు పంట పొలాలపై ప్రవహించిన సుమారు 30 ఎకరాలు కోతకు గురై,ఇసుక మేటలు వేయడం మూలంగా సుమారు 50 లక్షల రూపాయల మేరకు తీవ్ర నష్టం చేకూర్చిందని అన్నారు.తక్షణమే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని ఆపివేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గట్టుపల్లి సత్తిరెడ్డి,రైతులు వేణుగోపాల్ రెడ్డి,ప్రవీణ్ కుమార్ రెడ్డి,సుజాత,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.