సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లో రేయి పగలు తేడా తెలియకుండా అక్రమంగా ఇసుక తోలకాలు జరుపుతున్నారు.ట్రాక్టర్లకు సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకొని,పెద్ద పెద్ద సౌండ్ లు పెట్టుకొని అతివేగంగా అడ్డు అదుపు లేకుండా ఇసుక తోలకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు.
హుజూర్ నగర్ లో మెయిన్ రోడ్ నుండి ఇసుక తోలకాలు చేయకుండా గొందుల్లో సందుల నుండి ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు.అసలే స్కూళ్లకు సెలవులు ఇవ్వడం,ఎండాకాలం కావడంతో చిన్న పిల్లలు ఆటలు ఆడడం కోసం గొందు,సందుల్లో సంచరిస్తున్నారు.
వేగంగా వచ్చే ఇసుక ట్రాక్టర్ల వలన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం సందు నుండి ఎన్ ఎస్ పి క్యాంపు,బిఎస్ ఎన్ ఎల్ టవర్ దారి,గోదాం బజారు,ఏరియా హాస్పిటల్ సందు, కమల్ హాస్పిటల్ సందు,శ్రీనగర్ కాలనీ నుండి ఇసుక ట్రాక్టర్ల మాఫియా రేయి పగలు తేడా లేకుండా నడిపిస్తున్నారని స్థానికులు మొత్తుకుంటున్నారు.ఇకనైనా అధికారులు నిఘా పెట్టీ,ఏ ప్రమాదం జరకుండా ముందస్తు చర్యలు చేపట్టి,అక్రమ ఇసుక రవాణాను నియంత్రించాలని కోరుతున్నారు.