సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం మధ్యలోనే ఆగిపోయి,ఇళ్ళ మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.నిర్మాణం పూర్తి కాని ఇళ్ళల్లో కొందరు పశువుల్ని కట్టేస్తూ పశువుల కొట్టాలుగా మార్చేశారు.
జిల్లాల్లో అక్కడక్కడా నిర్మాణాలు పూర్తి చేసి ఏదో ఒక రకంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నా మునగాలలో ఇంకా పూర్తి చెయ్యకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అధికారులు కనీసం వాటిపై పర్యవేక్షణ చేయకుండా ఉండడంతో అసలు ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేనా,పేదలకు అందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు రెండేళ్ళ నుండి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
అయినా ఎవరూ వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.దీనిపై వివరణ కోరేందుకు పంచాయతీరాజ్ ఏఈ చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించక పోవడం గమనార్హం.
మునగాల డబుల్ బెడ్ రూం ఇళ్ళ విషయంలో అధికారులు స్పందించాలని ఓబీసీ మోర్చా నాయకులు దాసరి మధు డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయో అధికారులు చెప్పాలని, పశువులు కట్టేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.
లేదంటే ప్రజలను సేకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.







