సూర్యాపేట జిల్లా: బీజేపీ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వతంత్ర మహిళా జర్నలిస్టు తులసి చందుపై జరుగుతున్న వేధింపులు,అసభ్యకర ట్రోలింగ్,ప్రాణహాని బెదిరింపులను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాళ ధనంజయనాయుడు పిలుపునిచ్చారు.బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తులసి చందును కాపాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 8 ఏళ్ల కాలంలో అనేకమంది కవులను,రచయితలను, ప్రజాస్వామ్య వాదులను హతమార్చారని,గౌరీ లంకేష్,గోవిందు ఫన్సారే లాంటి వారిని భౌతికంగా లేకుండా చేశారని, భవిష్యత్తులో అనేక మందిని కూడా హతమార్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని దేశ ప్రజలు అందరూ గమనించాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో పాలకులు చేస్తున్న దురాగతాలను ఎండ కట్టడం తప్పా అని ప్రశ్నించారు.
దేశ ప్రజల వంట గదుల్లో దూరి ప్రజలు ఏమి తినాలో ఏమి తినకూడదోనని పాలకులు నిర్ణయిస్తారా అని, స్వతంత్ర భారతదేశంలో మున్నేడూ లేని రీతిలో కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని,మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇక ఎన్నడూ లేని రాచరిక వ్యవస్థను తయారు చేస్తారని,బహుశా ఇక ఎన్నికలు ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.తులసి చందు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మత మూఢవిశ్వాసాలను ప్రశ్నించడమే నేరమా అని, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారని,ఇటీవల కాలంలో కర్ణాటకలో బస్సు ఎక్కి దిగుతున్న ఒక మహిళ ప్రమాదాన్ని గురైతే అందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని,భవిష్యత్తులో ఎండలు విపరీతంగా కాచినా,వర్షాలు కురిసినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా అందుకు విపక్షాలే కారణమనే
స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.
మన దేశంలో రైతుల ఆత్మహత్యలకు, వ్యవసాయ కూలీలు అనుభవిస్తున్న దారిద్య్రానికి ప్రధాన కారణం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలనే కారణమన్నారు.నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు, సరఫరా చేస్తున్నది ప్రభుత్వానికి తెలియదా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉన్నదని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనిది ప్రభుత్వాలు కావా అని మండిపడ్డారు.
హిందూ విద్వేషాన్ని వెళ్లగక్కుతూ ప్రజా సమస్యలను పక్కకు పెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన చారిత్రక అవసరం ప్రజల ముందు ఉన్నదని అభిప్రాయబడ్డారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఇనుగుర్తి వెంకటరమణాచారి, నిగిడాల వీరయ్య పాల్గొన్నారు.