సూర్యాపేట జిల్లా:ప్రతి సంవత్సరం ఇవే కష్టాలు,ఇవే ప్రాంతాలు.ఈ నాయకులే,ఈ వర్షాలే,ఈ వరదలే.
వర్షాలు వస్తేనే పూడిక తీయాలని గుర్తు వస్తుందా? లావుగా ఉన్న నాలా సన్నగా ఎలా అయింది? ఏ డాక్టర్ మందులు రాసిచ్చాడు?ఆ డాక్టరు ఏ జెండా క్రింద దాగి ఉన్న రాజకీయ ప్రతినిధి? పేట ప్రజల దృష్టిలోవర్షం వస్తే తడవడం కాదు.మునుగడం మురుగు నీళ్ళతో సావాసం.
పుల్లారెడ్డి నిండితే అందులో ఉన్న డ్రైనేజీ తిరుగు ప్రయాణం.భయపడుతున్న గోపాలపురం,శ్రీనివాస కాలనీ,60 ఫీట్ల రోడ్డు జనం.
రానున్న భారీ వర్షాలతో జిల్లా కేంద్రం ప్రజలు ఇబ్బంది పడకుండా,వరదల వల్ల కాలనీలు మునగకుండా చూడాల్సిన బాధ్యత గెలిచిన రాజకీయ నాయకులపై, అధికారులపై ఉందని బహుజన ముక్తి పార్టీ జిల్లా నాయకులు పల్లేటి రమేష్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్న కాలనీలపై మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వరదలతో కాలనీలు మునుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టకుండా అధికారులు నిమ్మకు నీరత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అప్పటికప్పుడు తీసుకునే చర్యల వల్ల ఎటువంటి లాభం ఉండదని, మునిగిన తర్వాత పరామర్శించడం కంటే కాలనీలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.వర్షాకాలంలో మాత్రమే నాలా ఆక్రమణదారులు గుర్తొస్తారని, నాలాలను ఆక్రమించింది ఎవరని పాత ఫైల్స్ తీసుకొని రెండు రోజులు హడావుడి చేసి,ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప ఒరిగేదేమీ లేదని అన్నారు.
అసలు నాలాల ఎవరు కబ్జా చేశారు? ఎందుకు చేశారు? కబ్జాలకు కారకులు ఎవరనే విషయం అందరికీ తెలిసినా తెలియనట్లు నటించడం వల్లనే పేటకు ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.కళ్ళ ముందు అంతా జరుగుతున్నా కానకుండా ఉండి,ఇప్పుడు హడావుడి చేయడం వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని,వెంటనే నాలాల ప్రక్షాళన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.