సూర్యాపేట జిల్లా:కంచే చేను మేస్తే కాపాడే వాడేవారు ఎవరూ అన్న చందంగా తయారైంది మైనింగ్ అధికారుల పరిస్థితి.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రకృతి ప్రసాదించిన కొండలు,గుట్టలు కరిగి పోతున్నా కాపాడేవారే కరువయ్యారు.
ప్రకృతిని ధ్వంసం చేస్తూ కొండలను, గుట్టలను భారీ యంత్రాలతో చెద పురుగుల్లాగా మట్టి తొలిచి వేస్తూ అడ్డూ అదుపూ లేకుండా పట్ట పగలు యథేచ్ఛగా మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తుంటే వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ప్రభుత్వాలు ఏవైనా పాలకులుగా ఎవరున్నా అక్రమార్కుల మట్టి దందాకు ఏ ఢోకా ఉండదని,వీరంతా మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వి,రోడ్లు,లేఅవుట్లు,వెంచర్లు,ఇంటి నిర్మాణ పనులకు అక్రమంగా తరలిస్తూ మట్టి గుట్టలను మాయం చేస్తున్నారు.
అయినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారని ఆరోపణలు ఉన్నాయి.కొన్నిచోట్ల మట్టి వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై ఈ దందా జోరుగా సాగడానికి సహకరిస్తారనే ఆరోపణలు లేకపోలేదు.
ఇదంతా చాలా పకడ్బందీగా వ్యవసాయ క్షేత్రాల డెవలప్మెంట్ సాకుతో రైతుల పేరుతో ఓరల్ అనుమతి పొంది, ఇక దొరికినకాడికి ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విధంగా చేయడం వల్ల మట్టి వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ఎవరూ నోరు మెదపక పోవడం గమనార్హం.
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి.అనుమతులు ఉన్నదెవరు?ఎక్కడ అనుమతులు పొంది ఎక్కడ తవ్వకాలు చేస్తున్నారు? సక్రమంగా తరలిస్తుంది ఎవరూ?అక్రమంగా మట్టిని మాయం చేస్తున్నదెవరు? విచారణ జరిపి మట్టి దందాకు పాల్పడే దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.