సూర్యాపేట జిల్లా:జనగామ జిల్లా ఖిలషాపూర్ లో ప్రారంభం కానున్న బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.
ఎస్.ప్రవీణ్ కుమార్ 300 రోజుల రాజ్యాధికార యాత్రకు తుంగతుర్తి నియోజకవర్గ బీఎస్పీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.ఆదివారం స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వారు బీఎస్పీలో చేరుదాం- ఆర్ఎస్పిని ని ప్రగతి భవన్ కు పంపుదాం అనే నినాదంతో బయలుదేరారు.ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్పీ నాయకత్వంలో బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని బహుజనులంతా కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్పీ ఆధ్వర్యంలో అరెస్పీ నాయకత్వంలో 300 రోజుల యాత్ర జరుగుతుందని,రాజ్యాధికారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బహుజన ప్రజలు అరెస్పీకి బ్రాహ్మరథం పడతారని,త్వరలోనే రాజ్యాధికారం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
అగ్రవర్ణ పార్టీలలో బానిసల్లా బతకడం ఆపేద్దామని,బహుజనుల సొంత పార్టీ బీఎస్పీలో చేరుదామని,తద్వారా మన బతుకులు మార్చుకుందామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర బతుకు చిత్రం మారాలంటే ఆర్ఎస్పిని ప్రగతి భవన్ పంపడం ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు.బహుజనులరా…రండి,కదలి రండి,ఆర్ఎస్పితో కలిసి నడిచి,దొరల పాలనకు చమరగీతం పాడుదామని అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, తుంగతుర్తి నియోజకవర్గ బిఎస్పీ అధ్యక్షులు దాసరి శ్రీను,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అశోక్,జాజిరెడ్డిగూడెం మండల ఇన్చార్జి లక్ష్మణ్, నాగారం మండలం ఇన్చార్జి రావణ్,నాగారం మండల కన్వీనర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.