సూర్యాపేట జిల్లా: కోదాడ మండల ఎంపిపి చింత కవితారెడ్డి అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపిటిసిలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా ఎంపిటిసిలు ఎంపిపికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించడంతో కోదాడలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది.
గత ఐదేళ్లుగా కోదాడ ఎంపీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తుందని ఆరోపించారు.గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడినా ఎవరూ పట్టించుకోలేదని,కోదాడ పట్టణంలో పాత ఎంపీడీవో కార్యాలయంతో పాటు తారకరామా కాంప్లెక్స్ లో షాపింగ్ గదులు ఉన్నాయి.
కాగా ఎంపీపీ వాటిని అధీనంలోకి తీసుకొని నామమాత్రపు అద్దె ప్రభుత్వానికి చెలిస్తూ తాను మాత్రం ఒక్కొక్క షాపు నుండి 15 నుంచి 20 వేలకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నట్లు ఎంపీటీసీలు రాతపూర్వకంగా రాసి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.అంతేకాకుండా పాత ఎంపీడీవో కార్యాలయం ముందు చిరు వ్యాపారులకు అద్దెకిచ్చి నెలవారీగా వసూలు చేసుకున్నట్లు, జనరల్ ఫండ్స్ కు సంబంధించి ప్రతినెల 50 నుంచి 60 వేల వరకు దొంగ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని కాజేస్తున్నట్లు,దీంతోపాటు ఎఫ్.ఎఫ్.సి,ఎస్.ఎఫ్.సి నిధులకు సంబంధించి పాలకవర్గ సమావేశం, తీర్మానాలు లేకుండా,
కమిషన్లు నొక్కుతూ గుత్తేదారులకు పనులు అప్పగించినట్లు,గతంలో అధికారంలో ఉండగానే గుడిబండలో దళిత బంధు పెద్ద మొత్తంలో అవినీతి పాల్పడినట్లు ఆరోపించారు.కోదాడలో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని పలు పత్రికలు అప్పట్లోనే ఆమె అవినీతినీ ప్రచురించిన విషయం తెలిసిందే.పోలీస్ శాఖలో సైతం పోస్టింగ్ రావాలన్నా, బదిలీలు ఆపాలన్నా ఆమెకు కాసులు ముట్టచెపితే పని జరిగేదని,అంతేకాకుండా ఇసుక, మట్టి, వైన్స్ దందాల్లో షేర్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడేది కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయి.
ప్రస్తుతం ప్రభుత్వ మారడంతో ఎంపీపీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని,
సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని కోరడం గమనార్హం.ఇన్నేళ్లుగా అధికార బలం ఉండడంతో ఎంపీపీ అవినీతిపై నోరు మెదపలేకపోయారని, ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎంపీటీసీలకు కొండంత ధైర్యం వచ్చిందని,దీంతో ఎంపీపీ అవినీతిని బట్ట బయలు చేసెందుకు రంగం సిద్ధం చేసేందుకు ఎంపిటిసిలు స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.
అయినా అప్పటి ప్రభుత్వంలో అధికారులు నోరు మెదపలేదు.ఇప్పుడైనా అధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా చూడాలి మరి…!!