సూర్యాపేట జిల్లా:డా.బి.
ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన అగ్రకుల ఆధిపత్య శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు ప్రముఖుల పేర్లు పెట్టారని,కానీ,కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నామకరణం చేయడంతో కొన్ని మతోన్మాద,కులోన్మాద శక్తులు జీర్ణించుకోలేక నానా రాద్ధాంతం చేస్తూ హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ అల్లరి మూకలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.కొన్ని స్వార్థపర శక్తులు,మనువాద మతోన్మాద ఉన్మాద మూకలు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని ప్రతీ ఒక్కరు తీవ్రంగా ఖండించాలన్నారు.
ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.కోనసీమ జిల్లా ప్రజలందరిదని,అంబేద్కర్ ప్రజలందరి వాడని,ఇతర జిల్లాలకు పెట్టిన పేర్లు స్వీకరించినట్లుగానే అంబేద్కర్ పేరును కూడా స్వీకరించాలన్నారు.
అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు,పోలీసు యంత్రాంగం సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపాడాలన్నారు.కుల విద్వషాలు రగిల్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అన్ని రాజకీయ పార్టీలు సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్,సిఐటియు జిల్లా నాయకులు మామిడి సుందరయ్య,కెవిపిఎస్ జిల్లా నాయకులు ధనమూర్తి,లింగయ్య,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.