సూర్యాపేట జిల్లా: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని,అర్హత లేని వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోతె మండలం విభలాపురం, అప్పన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలందరికీ మంజూరు చేయాలని,అర్హత లేని వారి ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభలాపురం, అప్పన్నగూడెం గ్రామపంచాయతీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మొదటి లిస్టులో అర్హులైన పేదలను ప్రభుత్వం అధికారులు గుర్తించారని,
గుర్తించిన వారికి ఇవ్వకుండా విభలాపురం,రావి పహాడ్ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఒక్క ఇంటికి 7000 నుండి లక్ష రూపాయల వరకు అక్రమంగా అర్హత లేని వారి దగ్గర డబ్బులు తీసుకొని అర్హత లేని వారికి ఇండ్లు మంజూరు చేయించారని ఆరోపించారు.ఈ విషయమై అనేకసార్లు జిల్లా కలెక్టర్,ఆర్డీఓ తాహాసిల్దార్లకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి విభలాపురం, అప్పన్నగూడెం గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించి అర్హతలేని వారిని తొలగించి,అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గత కొంతకాలంగా పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఓట్లు వేసిన ప్రజలపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో జరిగిన అక్రమాలపై స్వయంగా ఎమ్మెల్యే విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హతలేని వారికి కేటాయించారని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశాల సందర్భంగా నిరసన తెలియజేసిన వారిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులతో దాడి చేయించారన్నారు.నాపై,నాతో పాటు ఉన్న మహిళలపై దాడి చేసిన మోతె ఎస్సై మహేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ అధికారి రామిరెడ్డికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మోతె మండల కార్యదర్శి మల్కూరి గోపాల్ రెడ్డి, నాగం మల్లయ్య,బూడిద లింగయ్య,వెలుగు మధు చేగువేరా,బోర్రాజు ఎల్లయ్య,వీరమల్ల వెంకట్, పెరుమాండ్ల నాగమణి, కళ్ళపల్లి సుగుణమ్మ, పులిగుజ్జు ఉప్పమ్మ,తురక రమేష్,కొండ రమణ,గోపి, రమణ,విజయ,సండ్ర ఉప్పలమ్మ,రజిత,మధు, నిర్మల,పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.