సూర్యాపేట జిల్లా:అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని( PDS rice) సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నూతనకల్ పోలీసులు పట్టుకున్నారు.ఎస్సై మహేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం…తుంగతుర్తి సీఐ డి.
శ్రీను నాయక్, నూతనకల్ ఎస్ఐ మహేందర్ మరియు నూతనకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది,స్పెషల్ బ్రాంచ్ తండు రవికుమార్ తో కలిసి బుధవారం సాయంత్రం 7:30 సమయంలో నూతనకల్ మండలం ఎర్రపహడ్ ఎక్స్ రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.ఈ సమయంలో అనుమానస్పదంగా వెళుతున్న అశోక్ లెలాండ్ TS30 T 3742 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అక్రమంగా మద్దిరాల మండలం నుండి ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుకు తరలిస్తున్న సుమారు 60 బస్తాలు (30 క్వింటాల్) పిడిఎస్ రైస్ ను గుర్తించారు.
రేషన్ బియ్యాన్ని,సరఫరా చేసే అశోక్ లైలాండ్ వాహనం స్వాధీనం చేసుకుని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ బియ్యం గురించి పట్టుబడిన వ్యక్తిని విచారణ చేయగా ఈ బియ్యం గతంలో సివిల్ సప్లై వారు సీజ్ చేసిన బియ్యమని,వేలం పాటలో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నానని,కొన్ని పత్రాలు చూపించగా, వాటిపై అనుమానంతో సంబంధిత సివిల్ సప్లై అధికారులకి తెలుపగా వారు ఇట్టి బియ్యం నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్నారని తెలుపగా వారి ఆదేశానుసారం కేసు నమోదు చేశారు.
నిందితులు గతంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం పాటలో కొనుగోలు చేసినామని చెప్తూ సరైన పత్రాలు లేకుండా సీజ్ చేసిన బియ్యం తరలింపు పేరు మీద నిబందనలని అతిక్రమించి బానోతు వెంకటేశ్వర్లు అను వ్యక్తి, మద్దిరాల రేషన్ డీలర్ అయిన వెంకట్ రెడ్డి షాప్ నుండి కాసం రమేష్ కి చెందిన అశోక్ లీల్యాండ్ ఆటోలో,కాసం రమేష్ రైస్ మిల్లు పాతర్లపాడుకు తీసుకువెళ్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కేసులో నూతనకల్ కు చెందిన పొన్నం మురళి,మఠంపల్లికి చెందిన బానోతు వెంకటేశ్వర్లు, పాతర్లపహాడ్ కు చెందిన కాశం రమేష్,మద్దిరాలకు చెందిన గూడ వెంకటరెడ్డి నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో సిఐ సీను నాయక్, ఎస్ఐ మహేంద్రనాథ్, కానిస్టేబుల్ రవి కుమార్, మల్లయ్య పాల్గొన్నారు.