సూర్యాపేట జిల్లా:ఆత్మవిశ్వాసం మనిషి ఆయుధమైతే వృద్దాప్యం కూడా ఓడిపోదా అనిపిస్తుంది ఈ అవ్వను చూసిన ఎవరికైనా.బుక్కెడు బువ్వ కొరకు ఎవరిపైనా ఆధారపకుండా,భర్త చేసే చేతి వృత్తిని జీవనాధారంగా చేసుకొని,జీవిత చరమాంకంలో ఓ అవ్వ పడుతున్న తిప్పలు నేటి యువతీ,యువకులకు మేలుకొలుపు అవుతాయంటే అతిశయోక్తి కాదు.
ఆడవారు వంటింటికి పరిమితం అనే రోజులు పోయి,అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్న కాలంలో కూడా అనేకమంది యువతీ యువకులు ఉపాధి అవకాశాలు లేవని నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న వైనం సమాజంలో నిత్యం కనిపించే నగ్న సత్యం.కానీ,సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో ఓ వృద్ధురాలు చెప్పులు కుడుతూ,తన చేతి వృత్తిలో వచ్చే కొద్దిపాటి సంపాదనతో జీవితాన్ని నెట్టుకొస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల కేంద్రానికి చెందిన ఈ అవ్వ కుటుంబం సుమారు పదిహేనేళ్ల క్రితం బతుకు దెరువు కోసం పొట్టచేత పట్టుకొని సూర్యాపేట పట్టణానికి వలస వచ్చింది.అప్పటి నుండి స్థానిక నల్లాలబావి వద్ద ఈ అవ్వ భర్త చెప్పులు కుట్టేవాడు.
అతని చేతి వృత్తితో వచ్చే కొద్దిపాటి పైకంతో జీవనం కొనసాగించేవారు.గత కొంతకాలంగా తన భర్త వృద్దాప్యం కారణంగా ఆరోగ్యం సహకరించక,ఇంటికే పరిమితమయ్యాడు.
దీనితో కుటుంబ పోషణ భారమై వారిని వృద్ధాప్యం వెక్కిరించింది.అయినా ఆ అవ్వ ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు.
మరొకరిపై ఆధారపడి ఎందుకు బతకాలని నిర్ణయించుకొని,తన భర్త చేసే చెప్పులు కుట్టే వృత్తిలో తానే నిమగ్నమై చెప్పులు కుట్టుకుంటూ,వచ్చే అరకొర డబ్బులతో తమ కుటుంబ ఆకలి బాధను తీరుస్తూ బతుకు బండి లాగుతుంది.ఈ సందర్భంగా ఆ అవ్వను పలకరించగా ఒకరి మీద ఆధారపడి బతకడం వల్ల వారికి కూడా ఆర్ధిక బరువేనని,తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఈ వృత్తిని కొనసాగిస్తూ నాలుగు మెతుకులతో కాలం గడుపుతామని కొండంత మనోదైర్యంతో,నిర్భయంగా చెప్పుకొచ్చింది.
ఆ అవ్వను చూసినా,ఆమె మాటలు విన్నా అవసరమైతే అర్ధాంగికి అద్దం పట్టేలా ఆయుష్షు తీరే వరకు అలుపెరుగని పోరాటంతో ఆకలి తీర్చే ఆదిపరాశక్తి అవుతుందని నమ్మక తప్పదు.ఇలాంటి వారికి ప్రభుత్వాలు చేయూతనందిస్తే చేదోడు వాదోడుగా ఉంటుందని అంటున్నారు పేట వాసులు.
ఓ పెద్ద సార్లు ఒకసారి ఆ అవ్వను ఆదుకునే ఉపాయం ఏదైనా ఉంటే జర చూసి,ఆమె ఆత్మవిశ్వాసం సడలకుండా చూడండి.