కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదు-రైతుల ధాన్యం కొనుగోలు చేయాల్సిందే,ధరలు తగ్గించాల్సిందే:టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి,కాంగ్రేస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పెంచిన డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్,విద్యుత్,ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

 Kcr Does Not Have A Brain - Farmers Need To Buy Grain, Reduce Prices: Tpcc Senio-TeluguStop.com

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయాలని,పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించి తీరుతామని,పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని,తగ్గించే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు.

పేద,సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలను పెంచడం అన్యాయమని,ఒక ప్రక్క రైతులు ధాన్యం అమ్మడానికి మార్కెట్టుకు తీసుకువస్తుంటే, మద్దతు ధర ఇవ్వకపోగా,ఇంకొక పక్క మిల్లర్లు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు ధాన్యాన్ని కొంటూ రైతులను మోసం చేస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తుందని,ఏమి చేయాలో దిక్కుతోచని దౌర్భాగ్యపు అయోమయ స్థితిలో కేసిఆర్ ఉన్నారని దుయ్యబట్టారు.రాజకీయ లబ్ది కోసమే ఢిల్లీ ధర్నా డ్రామా ఆడారని,కానీ,ఏమి సాధించలేక తోకముడిచినారని ఎద్దేవా చేశారు.

ధర్నా పేరిట టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో విందు వినోదాలలో మునిగి తేలారని,ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా,రాష్ట్రంలో పాలన పడకేసిందని అన్నారు.అంత హడావుడి పెంచేసి గంటసేపు కూడా ఢిల్లీలో ధర్నా చేయకుండా కేసీఆర్ ఎందుకు ముఖం చాటేశారో ప్రజలకు తెలియజెప్పాలని నిలదీశారు.

ఈ దీక్ష కోసం ఎంతో ఆర్భాటమైన ప్రచారం చేసి, సాధించింది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని,ఆత్మరక్షణలో పడిపోయాడన్నారు.

బిజేపి,టిఆర్ఎస్ ప్రభుత్వాధినేతలకు చిత్తశుద్ధి లేదని ఈ ఇద్దరి డ్రామాల్లో రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారని,ఇప్పటికే కళ్లాల్లో ధాన్యం తెచ్చిన రైతులకు,మిల్లర్లతో కేసిఆర్ మిలాఖత్ కావడం వలన మద్దతు ధర లభించక, క్వింటల్ కు 1300 రూపాయలకు రైతులు తెగనమ్ముకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు.దేశ,రాష్ట్ర చరిత్రలో ఇంతటి దౌర్భాగ్యపు దోపిడీ ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.కేసీఆర్ ప్రజల మద్దతు కోల్పోతున్న తరుణంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని,రైతు బంధు 5 వేలు ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఎకరాకు రైతులు రూ.12,000 నష్టపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.తెలంగాణలో నియంతృత్వ పాలనను అనుమతించేది లేదని,కేసీఆర్ ఆటలు ఇక సాగనీయమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీతో దీక్షా స్థలానికి చేరుకున్న దామోదర్ రెడ్డి,దాదాపు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ నేలపైనే కూర్చుని దీక్షలో పాల్గొన్నారు.

మూడు గంటల దీక్ష అనంతరం పోలీసులు దీక్షను భగ్నం చేసి,రాంరెడ్డి దామోదర్ రెడ్డితో సహా పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ,కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి,బైరు శైలేందర్,తూముల సురేష్ రావు,ధారావత్ వీరన్న నాయక్,కందాళ వెంకటరెడ్డి,కుంట్ల వెంకటనాగిరెడ్డి, కక్కిరేణి శ్రీనివాస్,మడిపల్లి విక్రమ్,కుమ్మరికుంట్ల వేణు,అమరారపు శ్రీనివాస్,ఆలేటి మాణిక్యం, తంగెళ్ళ కరుణాకర్ రెడ్డి,వెన్న మధుకర్ రెడ్డి,పోలగాని బాలు, నాగుల వాసు,కుందమళ్ళ శేఖర్,అక్కినేపల్లి జానయ్య,ఆరెంపుల రాజు,పఠాన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube