సూర్యాపేట జిల్లా:జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1150 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని,రాష్ట్రంలో మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్చార్జీల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రం నుండి నల్లగొండ లోక్ సభ పరిధిలో అత్యధిక నిధులు వచ్చాయన్నారు.రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు కావాలని ఏకంగా ప్రధానికి అర్జీ పెట్టుకుంటున్నారని,రాష్ట్రంలోని పేదలకు ఇళ్ళు ఇచ్చే క్రమంలో రాష్ట్రం అడ్డుకుంటుందని ఆరోపించారు.
కేసీఆర్, మమత బెనర్జీలు వారి తెలివిని ఉపయోగించి కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్రం ప్రభత్వం పూర్తిగా విఫలమైందని,అనేక శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగట్లేదని, స్థానికంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్,మోడీ ఇస్తానన్న ఉద్యోగాల మీద ఎలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగులకు అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్నామని,ప్రపంచంలో భారత దేశంలో మాత్రమే మోడీ చలవతో అత్యధిక స్టార్ట్ అప్ కంపెనీలు వచ్చాయని గుర్తుచేశారు.మోడీ ఆధ్వర్యంలో అధిక ఉద్యోగాలు వస్తుంటే కేసీఆర్ రాజ్యంలో మాత్రం అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలే ఉన్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్రాలలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే ఇక్కడ అభివృద్ధి జరగడంలేదని సర్పంచులు రాజీనామా చేస్తున్నారని, కేంద్ర నిధులు పక్కదారి పట్టించడంతోనే తెలంగాణాలో అభివృద్ధి దూరమౌతుందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికే పర్యటనలు చేపడుతున్నామని,బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుండడం వల్లే 3 రాష్ట్రాల నుండి నేడు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్నారు.
అలాగే కేంద్ర విచారణ సంస్థలతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారన్న అంశంపై స్పందిస్తూ ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ విచారణ సంస్థలు వాటి పని చేసుకుంటూ పోతాయని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుందని,ఎక్కడా విచారణ సంస్థలను దుర్వినియోగం చేయడంలేదన్నారు.ఎక్కడైతే అవినీతి రాజ్యమేలుతుందో అక్కడికి విచారణ సంస్థలు వస్తాయని, కొన్ని ప్రభుత్వాలు వారి కోసం,వారి పరివార స్వార్ధాల కోసం అవినీతికి పాల్పడుతున్నాయని,ఈడీ,సీబీఐలు వస్తే కేసీఆర్ కి ఎందుకు భయమని,విచారణ సంస్థల పేరు వింటే కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదులుతుందని,బీజేపీ పార్టీ వస్తే తన అవినీతి బయటపడుతుందని కేసీఆర్ కి భయమేస్తోందన్నారు.
సీబీఐని దుర్వినియోగ చేస్తున్నామనడం నిరాధారమన్నారు.ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసును సిట్ నుండి సీబీఐకి కోర్టు బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమి లేదని, పారదర్శక విచారణ జరిగే అవకాశం ఉన్నందునే సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బదిలీ చేశారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఏ పరిశ్రమ ఇద్దామన్నా కేసీఆర్ ప్రభుత్వం భూములు ఇవ్వడంలేదని,అయినా పలురంగాల్లో కేంద్రం భారీ నిధులు వెచ్చించిందని, పరిస్థితులు అనుకూలిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు.