సూర్యాపేట జిల్లా: చివ్వేంల మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసి,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం వద్ద కాలనీ నుండి వచ్చే మురుగు నీరు మడుగుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ దోమలు,ఈగలు స్వైర విహారం చేస్తున్నాయని, హాస్టల్లో 300 మంది పిల్లలున్నారని ప్రిన్సిపాల్ కవిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే హాస్టల్ ప్రాంతంలో మురుగు నీరు దుర్వాసన వెదజల్లుతుందని,పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.దశాబ్ద కాలం క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను ఎవరూ పట్టించుకోక పోవడంతో అస్తవ్యస్తంగా మారిందని,
సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన తర్వాత పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని,డ్రైనేజీ మొత్తం ఎక్కడిదక్కడ పేరుకుపోయి గ్రామం మొత్తం కంపు కొడుతోందని,పన్నులు ముక్కు పిండి వసూలు చేసే అధికారులు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై గ్రామ కార్యదర్శిని అడిగితే ఒక్కో అధికారికి రెండు మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని చెబుతున్నారని,అసలు గ్రామాల వైపు చూసే పరిస్థితిలో కార్యదర్శులు లేరని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల స్పందించి మండల కేంద్రంలో పడకేసిన పారిశుద్ధ్యం,హాస్టల్ వద్ద పేరుకుపోయిన మురుగు నీరు తొలగించి,డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని కోరుతున్నారు.