నల్లగొండ జిల్లా: ఆదానీ గ్రూపుకు సంబంధించిన పెన్నా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ జనవరి 18వ తేదీన శూన్యం పాడు,గణేష్ పహాడ్ గ్రామాలకు సంబంధించిన మైనింగ్ ప్రాంతంలో జరిగిన విషయం తెలిసిందే.అయితే ఆ రోజున జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రజలను మాయం చేస్తూ,మైనింగ్ చేస్తూ భవిష్యత్లో జరగనున్న ప్రక్రియకు విధివిధానాల రూపకల్పన కోసం పర్యావరణ ప్రభావిత అంచనాల కోసం ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగాను,కంపెనీ అనుకూలంగానూ జరిగిందని ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కొందరు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక ప్రజాభిప్రాయ సేకరణలు జరిగాయి.కంపెనీలు,ఫ్యాక్టరీలు,ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఆక్రమంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలో భాగంగా పర్యావరణ పరిరక్షకుల,స్థానిక ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
గతంలో యురేనియంకు సంబంధించి ప్రస్తుత నల్గొండ జిల్లాలోని కృష్ణపట్టే ప్రాంతంలోని నంబాపూర్,పెద్దగట్టు ప్రాంతంలో జరిగిన చారిత్రాత్మకమైన ప్రజాభిప్రాయ సేకరణ ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరిగింది.
స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ స్వేచ్ఛగా పాల్గొని తమ అభిప్రాయాలను పాలుపంచుకునే విధంగా అందరికీ అవకాశం కల్పించడం జరిగింది.
నాటి కలెక్టర్ సిసోడియా,అదేవిధంగా షేర్పల్లిలో జరిగిన యురేనియం ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా నాటి కలెక్టర్ విజయానంద్, నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగింది.ఈ రెండు ప్రజాభిప్రాయ సేకరణలు జరిగే కాలంలో మన జిల్లాలో నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్నది.
అయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలను గుర్తిస్తూ ఉదయం 10గంటలకు ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు జరగడం విశేషం.ప్రజలకి కనీస అవసరలైన నీరు,ఆహారం అందించడం అభినందనీయం.
ఈ కార్యక్రమంలో ప్రజలు అనుకూల,వ్యతిరేక అభిప్రాయాలని రికార్డు చేసి పంపడం చారిత్రాత్మకంగా,మన రాష్ట్రంలోనే గొప్ప ప్రజాభిప్రాయ సేకరణగా చెప్పవచ్చు.అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పైన కూడా మేళ్లచెరువులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చారిత్రాత్మకమైనదే.
కొన్ని గంటలపాటు ఆనాడు సభలకు అధ్యక్షత వహించిన కలెక్టర్లు తమ సమయాన్ని కేటాయించి ప్రజల నుంచి వచ్చే భావాలను, అనుకూల,వ్యతిరేక అభిప్రాయాలను రికార్డు చేయడం వాటికి ఆయా భావాల పట్ల యాజమాన్యాల నుంచి సమాధానం రాబట్టడం గొప్ప విషయం.కానీ,పెన్నా సిమెంట్స్ ఆదానీ గ్రూప్ కు సంబంధించి జరిపిన ప్రజాభిప్రాయసేకరణ 900 ఎకరాల భూమిని మైనింగ్ భూమిగా మారుస్తూ జరగనున్న కార్యక్రమానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ మూడు గంటలలో ముగించడం,మొదటి పబ్లిక్ ఇయరింగ్ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలానికి సంబంధించి దాదాపు 300 హెక్టార్లు 750 ఎకరాలకు పైన భూమిని మైనింగ్ భూమిగా మార్చే క్రమంలో జరిగే కార్యక్రమం ఒక గంట 40 నిమిషాలలో ముగించడం బాధాకరం.
స్థానిక ప్రజలు, పర్యావరణ పరిరక్షకులు తమ భావాలను వ్యక్తీకరించేటప్పుడు ప్రజల యొక్క భావనను,ప్రజల యొక్క ఆవేదనని స్పష్టంగా తెలియజేయాలని ప్రయత్నం చేసినప్పటికి ఉప సభాధ్యక్షత వహించిన అదనపు కలెక్టర్ పలుమార్లు అడ్డగించడం కేవలం పర్యావరణ అంశాలకే పరిమితం కమ్మని సూచనలు చేయడం బాధాకరం.
పర్యావరణం అనే పదం విశాల దృక్పథంతో కలిగి ఉన్నది.
సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితుల్ని ఆటవి మరి జీవవైవిద్యాల అంశాలను అందులో భాగంగా ఉంటాయి.వాటిని కూడా చర్చకు రాకుండా కేవలం నిరుద్యోగం, ఉపాధి అవకాశాల గురించి మాత్రమే చర్చిస్తే న్యాయం జరగదు కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఒక విషయాన్ని పరిశీలిస్తే కృష్ణపట్టి ప్రాంతంలో నల్లమల అడవులు మొదలుకొని సముద్రంలో కలిసే వరకు కృష్ణపట్టే గ్రామాలలో భౌగోళిక పరిస్థితుల్లో అనేక ప్రత్యేకతలు ఇమిడి ఉన్నాయి.ముఖ్యంగా సండ్రా,జామ,బిల్లుడు,మోదుగు,తంగెడు చెట్లు విరివిగా ఉంటాయి.
ఇవి మహా అరణ్యాలు కావు.కానీ,చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
సండ్రా కంప,కంపగా పెరిగి అది ఒక చెట్టుగా మారి, వృక్షజాతిలోనే రాజ్యసంగా చెప్పబడే టేకు తర్వాత ఉండే జిట్రేగా కర్రకు సమాంతరంగా ఉంటుంది.
జానా పండ్లు ఇది కృష్ణా ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి.
కేవలం కృష్ణానది పరివాహక ప్రాంతంలో మాత్రమే దొరికే ఈజాన పండ్లు తొలకరి జల్లులు పులకరించే వేళ్ళ మనకి దొరుకుతాయి.ఇవి పంచదార తీయదనం కన్నా బెల్లం తీపి కన్నా అద్భుతమైన తియ్యదనాన్ని పొంది ఉంటాయి.వీటి గురించి ఎవరు నోరు మెదపరు.కానీ,900 ఎకరాల భూమిని మైనింగ్ చేసే క్రమంలో ఈవృక్షజాతులకు ప్రత్యామ్నయం ఏంటి వీటిని ఏ విధంగా కాపాడుతారనే కనీస స్పందన లేకపోవడం బాధాకరం.అక్కడకు వచ్చిన పర్యావరణ పరిరక్షలు కూడా వనాలు పెంచండి,అడవులు పెంచండని చెప్తున్నారు.ఏవో పండ్ల వృక్షాలు లేదా రకరకాల చెట్ల పేర్లు చెప్తున్నారు.కానీ, కృష్ణపట్టే ప్రాంతంలో ఉండే రాతి నాపరాళ్ళ మధ్య పెరిగే ఇలాంటి అనేక వృక్షజాతులు లేదా మందు మొక్కలు ఇక్కడ ఉన్నాయి.
ఈ మందు మొక్కల గూర్చి సరి అయిన అవగాహన లేకపోవడం దురదృష్టకరం.
ఇప్పటికైనా డీటెయిల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో వాటి గురించి చర్చించాలని,వన్యప్రాణులకు సంబంధించి గతంలో చాలా జింకలు,సహజమైన అన్ని రకాల వన్నె ప్రాణులు కృష్ణ ప్రాంతంలో సంచరించాయి.సిమెంట్ పరిశ్రమలు వచ్చిన తదుపరి కనీసం కుందేళ్లు, అడవిపందులు కూడా ఈప్రాంతంలో బ్రతికలేని పరిస్థితి చూస్తున్నాము.
కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈకేశవరావు సిమెంట్స్ లో జింకలను పరిరక్షించేందుకు కేశవరావు సిమెంట్స్ బాధ్యత తీసుకొని మరి జింకల పార్కును,సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.ఇక్కడ కూడా అలాంటి సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆదాని లాంటి సంస్థలు పూనుకోవాలని,వ్యవసాయ రంగం పంటలకు సంబంధించి ఆలోచన చేస్తే 40 సంవత్సరాల క్రితం రాష్ట్రంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యాపార పంట పొగాకు ఉత్పత్తి కృష్ణపట్టే ప్రాంతంలో దామరచర్ల,నేరేడుచర్ల మండలాల్లో విరివిగా ఉండేది.
సిమెంట్ పరిశ్రమల రాకతో వీటి దూళి వలన పొగాకు ఆకులు ఉపయోగం లేక నిరుపయోగంగా మారి,ఆ పంటని వేయడం ఇక్కడి రైతులు మర్చిపోయారు.దానితోపాటు ధనియాలు, వాము తోటలను కూడా ఔషధ సుగంధ దవ్యాల పంటలని మరిచిపోయి కేవలం వరి పత్తి పంటలకే పరిమితమైపోయారు.
వ్యవసాయ రంగం మీద పారిశ్రామిక రంగం దాడి సాగిస్తోంది.మీరు మీ కంపెనీలలో వంద మందికి ఉపాధి కల్పించవచ్చేమో కానీ,మరి వేలాది మందికి జీవనోపాధ్యాయై స్వయంకృతం స్వయం పోషికంగా ఉండే వ్యవసాయ రంగాన్ని పంటలు మార్పిడి విధానానికి బలవంతంగా నెట్టివేయబడుతున్న విధానాన్ని ఆలోచన చేయవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది.
ఈ అంశాలని ప్రజాభిప్రాయ సేకరణలో చర్చించాలి.కానీ, అలా జరుగలేదు.
కానీ,ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణపై ఒక్కసారి ఆలోచన చేయండి.వాటికి ప్రతినిధి ఎవరు.? ఆ జీవ జంతువులను,ఆ వృక్షాలని,ఆ మందు మొక్కల కోసం,పశువుల సంరక్షణ కోసం ప్రత్యామ్నాయ ఆలోచన చేయకపోతే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కేవలం మనుషులుగా మన అభివృద్ధి గూర్చి,మన వాహనాల గూర్చి,మన ఉద్యోగాల గూర్చి,మన భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తున్నాం.
కానీ, మానవజాతి మనుగడ మొత్తం కూడా జీవజాతుల మీద ఆధారపడి ఉంది.ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఒకప్పుడు ప్రఖ్యాతిగాంచిన గుడ్లగూబలు, పక్షి జాతులు ఉండేవి.ఈ మైనింగ్ ప్రక్రియ వలన ఈ పక్షజాతి కనుమరుగైపోతుంది.కనీసం వ్యక్తి చనిపోతే పిండం పెట్టేందుకు కూడా కాకులు రాని పరిస్థితికి కృష్ణ పట్టే వెళ్లిపోయింది,అంటే ఈ పర్యావరణం ఎంతవరకు జరుగుతుంది.
పర్యావరణ పరిస్థితి ఏంటి? ఈ 40 సంవత్సరాలలో జరిగిన పర్యావరణ ప్రభావం ఏంటి.? వీటన్నిటిని చర్చించుకోకపోతే ఈ ప్రజాభిప్రాయ సేకరణకి అర్థం ఉంటుందా అధికారులారా ఒకసారి ఆలోచన చేయండి.మనం ప్రకృతి మాత ఒడిలో ఉన్నంతవరకే మనకి రక్ష.మనకి ఎలాంటి వేరే విధి విధానాలు రక్షణ కాదు.ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు అదాని కంపెనీ వాళ్ళు ఒక రేట్ మాట్లాడుకొని ఇక్కడకు పిలిపించి వారంత ఫ్యాక్టరీ కి అనుకాలంగా అధికారుల ముందు చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫ్యాక్టరీ గేట్ ముందు వారికి రావలసిన వాటా కోసం నిరసన వ్యక్తం చేయడం కొసమెరుపు.







