నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1962 పశు సంచార వాహన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మూగజీవాల ప్రాణాలను కాపాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.కానీ, అందులో పని చేస్తున్న సిబ్బందిపై మాత్రం ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపడంతో దిక్కుతోచని స్థితిలో పడి బిక్కుబిక్కు మంటూ సేవలు కొనసాగిస్తున్నారు.
ఇచ్చే చాలిచాలని జీతాలు కూడా క్రమం తప్పకుండా నెలనెలా ఇవ్వకపోవడంతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది.జీతం ఎప్పుడు వస్తుందో రాదో తెలియక అప్పులు చేస్తూ అర్ధాకలితో గడపే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం సిబ్బంది జీతాల నిధులను విడుదల చేయక కుటుంబ పోషణ రోజు రోజుకు భారంగా మారుతుంది.ప్రజా ప్రభుత్వంలోనైనా తమ బతుకులు మారుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న 1962 సిబ్బందికి నిరాశే మిగిలింది.
ఇక చేసేదేమీ లేక సిబ్బంది సమ్మెకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.ఒకవేళ అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యవరస పశు వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో మనుషులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్,గర్భిణులు,బాలింతలకు 102 వాహన సౌకర్యం కల్పించడంతో పాటు పశువైద్య సేవలకు కూడా 1962 అంబులెన్స్ వాహనంతో సంచార పశువైద్య సేవలకు శ్రీకారం చుట్టింది.ఈ సంచార వాహనం ద్వారా పశువులు, గొర్రెలు,మేకల వంటి మూగ జీవాలకు 1962 అంబులెన్స్ ద్వారా వైద్యుడు,ఇతర సహాయ సిబ్బంది అత్యవసర సేవలు అందిస్తున్నారు.
ఈ అత్యవసర సేవల వల్ల సకాలంలో వైద్య సేవలు అంది రాష్ట్రంలో అనేకమంది ప్రాణాలు,అనేక పశువులు ప్రాణాలు నిలిచాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 100 వాహనాలు సేవలు అందిస్తున్నాయి.1962 పశు సంచార వాహన సేవల్లో పశు వైద్యులు పారామెడిక్, సహాయకులు,డ్రైవర్లు సేవలు అందిస్తుండగా గత కొన్ని నెలలుగా వేతనాలు లేక ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు.క్షేత్రస్థాయిలో మూగ జీవాలకు సేవలు అందిస్తున్న ప్రజల నుండి అభినందనలు తప్ప ప్రభుత్వం నుండి నిధులు అందక సిబ్బంది వేతనాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ఇలాంటి అత్యవసర సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా 24 గంటలు సర్వీస్ ఇస్తున్న సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి చిన్నాభిన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది.గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైప్పుడు మెరుపు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆనాటి ప్రభుత్వం దిగివచ్చి నిధులు విడుదల చేసింది.
దాంతో కొంతకాలం పాటు వచ్చే జీతాలతో సిబ్బంది తమ సేవలు కొనసాగించారు.ప్రభుత్వం మారాక కూడా అదే పరిస్థితి పునరావృతం కావడంతో గత నాలుగు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కుటుంబ పోషణ భారం అవుతున్నా ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో అర్ధాకలితో తమ సేవలు మాత్రం నిబద్ధతతో చేస్తున్నారు.
అయినా సర్కార్ నుండి ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
ప్రభుత్వ పెద్దలకు విన్నపాలు ఎన్నిచేసినా మన్నుపాలు కావడంతో సమ్మె నోటీసు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులను విడుదల చేయకుంటే ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగుతామనే సంకేతం ప్రభుత్వానికి చేరవేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 1962 మూగజీవాల సేవల ను పటిష్టంగా అమలుపరిచి,క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి సిబ్బందిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కేంద్రంగా 12 సంచార 1962 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంటూ మండలాలు, గ్రామాల్లోని పశువులు,మేకలు, గొర్రెలకు అత్యవసర వైద్య సేవలందిస్తున్నాయి.
ఒక్కో వాహనంలో ఒక వైద్యుడు, పారావిట్,హెల్ఫర్,డ్రైవర్ చొప్పున మొత్తం 48 విధులు నిర్వహిస్తారు.అత్యవసర సేవలైన కాన్పులు,కుట్లు వేయడం,శస్త్ర చికిత్సలు చేయడం,చిన్న చిన్న దెబ్బలకు ప్రథమ చికిత్సలు చేస్తుంటారు.
ఒక్కో నియోజకవర్గంలో 90 గ్రామాలకు పైగా అత్యవసర సంచార సేవ లందిస్తున్న అంబులెన్స్ లోని వైద్యుడు, సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.వెంటనే ప్రభుత్వం,జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ స్పందించి తమకు వేతనాలు అందించాలని కోరుతున్నారు.
లేనియెడల సమ్మెకు వెళ్ళడం తప్పా మరో గత్యంతరం కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు.సర్కార్ 1962 సిబ్బంది గోడు పట్టించుకొని వారి సమస్యను పరిష్కరిస్తుందా…? లేదంటే లైట్ తీసుకుంటుందా…? అనేది వేచి చూడాలి మరి.







